హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత యూరప్ ట్రిప్ పై అనేక గాసిప్స్ వినబడుతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కథలు అల్లేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో వివిధ ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో పవన్ యూరప్ ట్రిప్ ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. 

వాస్తవానికి పవన్ కళ్యాణ్ యూరప్ ట్రిప్ తన కుటుంబం కోసం వెళ్లారని తెలిసింది. పవన్ అన్నా లెజోనోవాల కుమారుడు శంకర పవనోవిచ్‌కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయవలసిన కొన్ని లాంఛనాలను పూర్తి చేసేందుకు యూరప్ వెళ్లారని సమాచారం.

కార్యక్రమాలు పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ యూరప్ లోనే క్రిస్ట్‌మస్ వేడుకల్లో పాల్గొంటారని తెలిసింది. రెండు రోజుల్లో యూరప్ పర్యటన అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్‌ చేరుకుంటారు.  

జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించిన ఆయన సోదరుడు నాగబాబు, హీరో వరుణ్ తేజ్‌‌ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్వీట్ కూడా చేసేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరానికి సమయం సమీపిస్తుండటంతో పవన్ కళ్యాణ్ ఇక విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తిష్ట వెయ్యాలని భావిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా  పవన్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పార్టీ గుర్తును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.