అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రూ. 30 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం తిరుపతి లో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు భరత్ జీకి ఆ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.

పవన్ కల్యాణ్ తో పాటు  అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు రూ. 5 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్ కాలేజీ ఎండీ కృష్ణా రెడ్డి రూ. 6 కోట్లు భారీ విరాళాన్ని ప్రకటించారు. 

రామాలయ నిర్మాణం కోసం బీజేపీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహిస్తున్నారు. రామాలయ నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతోనే విరాళాలు సేకరిస్తున్నారు. రాజకీయ నాయకులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. 

దీంట్లో భాగంగానే తనవంతు విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్ అనంతరం మాట్లాడుతూ ''ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. సహనం, శాంతి, త్యాగం, శౌర్యం.. ఈ దేశం ఎలాంటి దాడులు, ఒడిదుడుగులు ఎదురైనా మన దేశం బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరాముడు చూపిన మార్గమే. పరమత సహనం  మనదేశంలో ఉందంటే అది ఆయన చూపిన దారే.  అందుకే రామరాజ్యం అన్నారు. అన్ని మతాల వారు, ప్రాణకోటి సుఖంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం కడుతుంటే భారతీయులంతా పిల్లాపాపలంతా విరాళాలు ఇస్తున్నారు. నా వంతుగా రూ.30 లక్షలు ఇస్తున్నా.'' అన్నారు.

శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యు నేత భరత్ చెక్కును అందించారు. అంతేకాదు పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది రూ. 11000 ఇచ్చారు. వారిలో హిందువులు, ముస్లింలు,క్రిస్టియన్లు కూడా ఉన్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.