ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ, టీడీపీపై పవన్ సీరియస్ అయ్యారు. ఆ రెండు పార్టీలు కలిసి రైతుల జీవితాలను ఛిద్రం చేశాయని వ్యాఖ్యానించారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ వ్యక్తిగత, పాతకక్షలతోనే రాజధాని మార్పు నిర్ణయం తీసుకుందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

Also Read:రాజధానిపై జగన్ సర్కార్ మరో ముందడుగు... సీఆర్డీఏ స్థానంలో ఏఎంఆర్డీఏ

టీడీపీ, వైసీపీ రెండూ ఒకటేనన్న ఆయన.. అధికార వికేంద్రీకరణ పేరుతో రెండు ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు రేపుతోందని పవన్ ఆరోపించారు. రూ.లక్ష కోట్ల రాజధాని టీడీపీ మాటకు, 3 రాజధానుల వైసీపీ మాటకు.. జనసేనకు సంబంధం లేదని పవన్ తేల్చి చెప్పారు.

ఇవాళ పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన జనసేన అధినేత... మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడంతో తదుపరి పార్టీ కార్యాచరణపై చర్చించారు. ఐదేళ్ల పాటు చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు.

Also Read:మూడు రాజధానులపై టీడీపీకి వైసీపీ కౌంటర్: వల్లభనేనితో బాబుకు జగన్ చెక్

రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదట్నుంచీ చెబుతున్నామని పవన్ గుర్తుచేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని.. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తామని పవన్ వెల్లడించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడు రాజధానులకు రూట్ క్లియర్ అయ్యింది. దీని ప్రకారం విశాఖలో అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ , కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటవుతాయి.