అమలాపురంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్ధితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దవద్దంటూ ఆయన హితవు పలికారు
కోనసీమ జిల్లాకు (konaseema distrcit) అంబేద్కర్ పేరు వద్దంటూ మంగళవారం జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే . దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అమలాపురంలో నెలకొన్న పరిస్ధితులను అందరూ ఖండించాలని ఆయన కోరారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని.. అంబేద్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్నారు. అమలాపురంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైందని పవన్ దుయ్యబట్టారు.
వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారని.. వాళ్ళ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లా వాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. వై.సి.పి.ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దవద్దంటూ పవన్ కల్యాణ్ హితవు పలికారు.
Also Read:‘కోనసీమ’ జిల్లాకై ఆందోళనలు.. అల్లర్ల వెనుక జనసేన, టీడీపీ హస్తం : హోంమంత్రి వనిత సంచలన వ్యాఖ్యలు
కాగా.. కోనసీమ జిల్లాకు (konaseema district) అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ మంగళవారం జరిగిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగడంతో.. పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఇదే సమయంలో ముమ్మడివరం వైసీపీ ఎమ్మెల్యే (mummidivaram mla) పొన్నాడ సతీశ్ ఇంటిని సైతం ఆందోళనకారులు తగులబెట్టారు. అంతకుముందు అమలాపురంలోని మంత్రి విశ్వరూప్ (pinipe viswarup) ఇంటిపై దాడి చేసిన నిరసనకారులు.. నిప్పు పెట్టారు. దీంతో మంత్రి ఇంటిని వదిలి వెళ్లిపోయారు. అలాగే విశ్వరూప్ ఇంట్లో వున్న 3 కార్లను సైతం తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
దీనిపై విశ్వరూప్ మాట్లాడుతూ.. తన ఇంటిని తగులబెట్టడం దురదృష్టకరమన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణమని.. టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్ చేస్తేనే అంబేద్కర్ పేరు పెట్టామని విశ్వరూప్ తెలిపారు. ఇప్పుడు ఆ పార్టీలు మాట మార్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాని ఆయన ఆరోపించారు. అందరినీ వేడుకుంటున్నానని.. మీ అభ్యంతరాలు పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
