కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని కోరుతూ జేఏసీ మంగళవారం నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే వీటి వెనుక టీడీపీ, జనసేనలు వున్నాయని హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. అంబేద్కర్ పేరు వ్యతిరేకించడం సరికాదని ఆమె హితవు పలికారు. కోనసీమ ఆందోళన వెనుక టీడీపీ, జనసేన పార్టీలు వున్నాయని హోంమంత్రి ఆరోపించారు.
కాగా.. కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి Amalapuramలో మంగళవారం నాడు టెన్షన్ కు దారి తీసింది. ఈ ఆందోళనను పురస్కరించుకొని అమలాపురంలో ఇవాళ 144 సెక్షన్ విధించడంతో పాటు 25 చోట్ల పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే మధ్యాహ్నం మూడు గంటలకు ఒక్కసారిగా జేఎసీ నేతృత్వంలో ఆందోళనకారులు గడియారం స్థంభం నుండి Collectorate వరకు ర్యాలీని ప్రారంభించారు. అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.ఈ సమయంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.
SP వాహనంపై రాళ్లు రువ్వడంతో ఎస్పీ తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అయితే అక్కడే ఉన్న డీఎస్పీ, గన్ మెన్లు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దొరికినవారిని దొరికినట్టుగా చితకబాదారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను తరలించేందుకు తీసుకు వచ్చిన వాహనాలను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలు వాహనాలు ద్వంసమయ్యాయి. ఆందోళనకారులను తరలించేందుకు వచ్చిన రెండు వాహనాలను దగ్దం చేశారు. ఆందోళనకారుల దాడిలో డీఎస్పీతో పాటు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జీలో కూడా పలువురు ఆందోళనకారులు కూడా గాయపడ్డారు.
ఇకపోతే.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కోనసీమ జిల్లా పేరును మార్చిన సంగతి తెలిసిందే. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు ఇచ్చిన వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే కోనసీమ జిల్లాగానే పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆందోళనలు నిర్వహిస్తుంది. ఇదే సమయంలో బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి లేదని కూడా పోలీసులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు.
కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని కొందరు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు ఉండాలని మరో వర్గం వాదిస్తుంది. రెండు వర్గాలు పోటా పోటీగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ రెండు వర్గాలు తమ వాదనలను సమర్ధించుకుంటున్నాయి. అయితే అందరి కోరిక మేరకే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చామని మంత్రి పినిపె విశ్వరూప్ చెప్పారు.
