విశాఖ గాజువాకలో వరలక్ష్మీ అనే యువతి ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం జనసేన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘‘ గాజువాకలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన పదిహేడేళ్ళ బాలికపై ప్రేమోన్మాది దాడిచేసి హత్య చేసిన ఘటన ఎంతో బాధ కలిగించింది. ఆ విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

ఆ ఆడబిడ్డ తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కొద్ది రోజుల కిందటే విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి హత్య చేసిన దుర్మార్గాన్ని ఎవరం మరచిపోలేదు.

ఇప్పుడు గాజువాకలోనూ అదే తరహా ఉన్మాదపు హత్య చోటు చేసుకోవడం దారుణం. ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలి. విద్యార్థినులు, యువతులు, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించకూడదు.

దిశ చట్టం చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రకటనలు చేసి ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై ఏం సమాధానం చెబుతారు.

చట్టాలు చేసేశామని చేతులు దులుపుకొంటే ఫలితం రాదు. ఆ చట్టం ఇప్పటికీ అమలులోకి రాకపోవడానికి కారణాలు ఏమిటో ప్రజలకు చెప్పాలి. ప్రచారాలతో ఫలితం రాదు అని గ్రహించాలి. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థినులకు ఆత్మ రక్షణ విద్యలు తప్పనిసరి చేయాలి.

అదే విధంగా యువతులకు, మహిళలకు ఆత్మ రక్షణ మెళకువలు తెలపాలి. విద్య, స్త్రీ శిశు సంక్షేమ, హోమ్ శాఖలు సంయుక్తంగా ఇందుకు సంబంధించి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలి.