అమరావతి: అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. వరదల్లో చిక్కుకుపోయి ప్రజలు నానా కష్టాలు పడుతుంటే డ్రోన్ల రాజకీయం చేయడం తగదని హెచ్చరించారు. 

అమరావతిలో మాట్లాడిన పవన్ కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లు పడుతుంటే వారిని పట్టించుకోకుండా రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. బాధితులకు సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమన్నారు. 

వరద ఉద్ధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడడం మానేసి, కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా? లేదా? అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటం ఇదేనా మంత్రుల బాధ్యత అంటూ నిలదీశారు. వరద ఉద్ధృతి పెరిగితే కరకట్ట ప్రాంతంలో ఉన్న అన్ని నివాసాలూ మునుగుతాయని, అందుకోసం డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదన్నారు. 

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి, వారికి కావాల్సిన అన్ని రకాల సహాయాలు చేయాలని పవన్ సూచించారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిని ముంచేస్తారా? అని ప్రతిపక్షం, మునిగిందా?లేదా? అని చూసేందుకు అధికార పక్షంవాళ్లు వెళ్లి రాజకీయాలు చేస్తూ ప్రజలను వరద నీటికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే తరువాత చూసుకోవాలని ఇలాంటి సమయాల్లో  కాదని సూచించారు. ప్రజల పట్ల బాధ్యతతో సుపరిపాలన అందించాలని 151 సీట్లు ప్రజలు ఇచ్చారని అంతేగానీ విమర్శలకు తావిచ్చేలా వ్యవహరించడానికి కాదన్నారు. జనసేన ఎప్పుడూ రాజకీయాల్లో హుందాతనం కోరుకుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.