మూడు రాజధానులపై కేంద్రం జోక్యం చేసుకోదని తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమరావతి గురించి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పవన్ చర్చించారు.

అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలోనే గణతంత్ర వేడుకలు అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి.. మళ్లీ చివరికి బెజవాడకు షిప్ట్ చేశారని దీనిని బట్టి రాజధాని తరలింపు ఎంత కష్టమో తెలుస్తుందన్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌నే ఇన్నిసార్లు మార్చుకున్నప్పుడు రాజధానిని తరలించడం అంత తేలికా అని పవన్ ప్రశ్నించారు. 

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందించిదన్న విషయాలు చర్చించామన్నారు. ప్రభుత్వాలు మారాయి కానీ... ప్రభుత్వ పనీతీరు మాత్రం మారలేదని, కేంద్రం నుంచి ఎన్నో నిధులు కేటాయిస్తున్నప్పటికీ సరిగా వినియోగించుకోవడం లేదన్నారు.

Also Read:బాబుతో లెక్క సెటిల్ చేసుకుంటూనే జగన్ కు కేసీఆర్ వంత... ఏపీ కుదేలు

అమరావతికి సంబంధించి త్వరలో బీజేపీ-జనసేన కలిసి బలమైన కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ తెలిపారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అని జనసేనాని స్పష్టం చేశారు.

వైసీపీ నేతలంతా కేంద్రప్రభుత్వానికి చెప్పే రాజధాని మారుస్తున్నామని చెబుతున్నారని.. అయితే భారత ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు సమ్మతించలేదని జనసేనాని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను భ్రష్టుపట్టించే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని పవన్ ఆరోపించారు.

Also Read:మండలి ఓటింగ్ ఎఫెక్ట్: వైసీపీలోకి పోతుల సునీత?

జగన్ ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటాయని ఆయన హెచ్చరించారు. రైతులు, మహిళలను విచక్షణారహితంగా చావబాదారని వీటిపైనా నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు పవన్ తెలిపారు.