Asianet News TeluguAsianet News Telugu

అలా చేసేవాళ్లు... నాకు ఎబ్బెట్టుగా ఉండేది: పుట్టినరోజు వేడుకలపై పవన్ స్పందన

ఇప్పుడున్న ఆరోగ్య విపత్కర పరిస్థితుల్లో జనసేన శ్రేణులు, నాయకులు, అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో విలువైనవన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. 

janasena chief pawan kalyan comments on his birthday celebrations
Author
Hyderabad, First Published Sep 1, 2020, 9:46 PM IST

ఇప్పుడున్న ఆరోగ్య విపత్కర పరిస్థితుల్లో జనసేన శ్రేణులు, నాయకులు, అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో విలువైనవన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. మంగళవారం పార్టీ మీడియా విభాగంతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు సామాజిక సేవా మార్గాన్ని ఎంచుకోవడాన్ని ఎప్పటికీ మరచిపోను అన్నారు.

జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనసైనికులు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ కిట్లు వితరణ చేశారు. ఈ సేవా కార్యక్రమాల విషయాన్ని నేతలు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ 

* సహజంగా ఎవరైన పుట్టిన రోజు అంటే ఆడంబరంగా వేడుకలు చేసుకొంటారు. వారికి తోచిన స్థాయిలో వేడుకలు జరుపుకుంటారు. మీరు అందుకు భిన్నంగా వేడుకలకు దూరంగా ఉంటారు. ఇందుకు ఏమైనా కారణాలు ఉన్నాయా?   

ప్రత్యేకించి కారణాలు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. చిన్నప్పుడు ఒకటి, రెండు సందర్భాల్లో స్కూల్లో చాక్లెట్లు పంచినట్లు గుర్తు. తర్వాత అన్నయ్య దగ్గరకు వెళ్లడం... అటు నుంచి ఇటు రావడం ఈ ప్రక్రియలో పుట్టిన రోజుని నేను, నాతోపాటు మా ఇంట్లో వాళ్లు కూడా మరిచిపోయేవారు.

రెండు రోజుల తర్వాత ఇంట్లో ఎవరికో ఒకరికి గుర్తొచ్చేది. గుర్తొచ్చినప్పుడు మా వదిన డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కునేవాడిని. అంతకుమించి ప్రత్యేకంగా జరుపుకోవడం అలవాటు లేదు.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది అనిపించింది. కేక్ కట్ చేయడం, ఆ కేక్ తీసుకొచ్చి నా నోట్లో పెట్టడం ఎబ్బెట్టుగా అనిపించి మానేశాను. అంతే తప్ప ప్రత్యేకంగా వేరే కారణాలు ఏమీ లేవు.


* మీ జన్మదినాన్ని పురస్కరించుకొని జనసైనికులు, అభిమానులు, వీర మహిళలు సేవా వారోత్సవాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తొలి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు 341 ఆక్సిజన్ సిలిండర్ కిట్లు అందజేశారు. అలాగే చాలా చోట్ల రక్తదాన శిబిరాలు, పేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. వీర మహిళ విభాగం సభ్యులు వన సంరక్షణ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మీకు ఏమి అనిపిస్తోంది..? 


నా గురించి నేను పెద్దగా ఆలోచించను. అలాగే ఎక్కువగా ఊహించుకోను. నెల్లూరులో పెరుగుతున్నప్పుడు ఎలాంటి మధ్యతరగతి ఆలోచన దృక్పథంతో ఉన్నానో... ఇప్పుటికి అదే విధంగా జీవిస్తున్నాను.

నన్ను లక్షలాది మంది అభిమానించడం, అదరించడం చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. సుస్వాగతం సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో ఫంక్షన్ ఉంది తప్పకుండా రావాలంటే ఇబ్బంది పడుతూనే కర్నూలు వెళ్లాను.

తీరా అక్కడికి వెళ్లాకా రోడ్ షో చేస్తూ తీసుకెళ్తాం అన్నారు. దేనికి అని అడిగాను. మిమ్మల్ని చూడటానికి జనం చాలా మంది వచ్చారు అని చెప్పారు. నన్ను చూడటానికి ఎవరొస్తారు అనుకున్నాను.

ఆ వాహనం ఎక్కేటప్పటికీ దారి పొడువునా విపరీతమైన జనం ఉన్నారు. వీళ్లందరు నన్ను చూడటానికే వచ్చారా అనుకున్నాను. నాకు అప్పుడే అనిపించింది వాళ్లకు నాకు మధ్య పెద్ద తేడా లేదు.

వాళ్లు అటువైపు ఉన్నారు... నేను ఇటువైపు ఉన్నాను అంతే అని. అటువంటి ఆలోచనా విధానం వచ్చింది తప్ప నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారనే ఆలోచన విధానం ఎప్పుడు లేదు.

నా ప్రమేయం లేకుండా నా పుట్టిన రోజును పురస్కరించుకొని సేవా వారోత్సవాలు చేస్తున్నారంటే అది జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పతనం.  వారికి నా తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం సమాజానికి ఉపయోగపడితే నిజంగా చాలా తృప్తిగా ఉంటుంది. ఇందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios