జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పు కాపుల్లో బలమైన నేతలు ఉన్న.. ఆ వర్గం వారు వెనకబడే ఉన్నారని అన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పు కాపుల్లో బలమైన నేతలు ఉన్న.. ఆ వర్గం వారు వెనకబడే ఉన్నారని అన్నారు. తాను సీఎం అయితే అన్నింటికి పరిష్కారం దొరకదని అన్నారు. పవన్ కల్యాణ్‌ సమక్షంలో పలువురు తూర్పు కాపు నేతలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా వారి సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తూర్పు కాపులు ఎక్కువగా వలసలు వెళ్తున్నారని అన్నారు. వంశధార నిర్వాసితుల్లో ఎక్కువ మంది తూర్పు కాపులేనని చెప్పారు. దేశంలోని ఏ నిర్మాణం వెనకైనా ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉన్నారని అన్నారు. 

తూర్పుకాపుల్లో మంత్రులు ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆ వర్గం ప్రజలు వెనకబడే ఉన్నారని అన్నారు. వారి గురించి మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లు ఆలోచించాలని కోరారు. తూర్పు కాపుల జనాభాపై ఒక్కో ప్రభుత్వం ఒక్కో లెక్క చెబుతోందని అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ముందుగా తూర్పు కాపుల గణంకాలు తీస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సమాజంలో కూడా తూర్పు కాపుల సంఖ్య ఎక్కువ అని అన్నారు. ఇతర బీసీ కులాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నప్పుడు.. తూర్పుకాపులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. 

తాను సీఎం అయితే అద్భుతాలు ఏమీ జరగవని అన్నారు. సీఎం పదవి అనేది మంత్రదండం కాదని చెప్పారు. తాను సీఎం అయిన తరువాత ఏదైనా చేయాలనుకున్నా.. అధికారులో, నాయకులో అడ్డుపడతారన్నారు. చైతన్యం ఉన్న సమాజమే మంత్రదండమని అన్నారు. తాను సీఎం అయినా ప్రజలు తనను నిలదీసే స్థాయికి రావాలని అన్నారు.