Asianet News TeluguAsianet News Telugu

‘సీఎం పదవి వరించి రావాలి’.. ముఖ్యమంత్రి పదవిపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టత.. ‘పొత్తులకు ఆ కండీషన్ లేదు’

పవన్ కళ్యాణ్ మరోసారి పొత్తుల గురించి, సీఎం పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో జనసేనకు 30 సీట్లు వచ్చి ఉంటే ఇప్పుడు సీఎం రేసులో ఉండేవాడనని, ప్రస్తుతానికైతే ఆ రేసులో లేనని చెప్పారు. పొత్తులకు సీఎం కండీషన్ లేదని అన్నారు. సీఎం పదవి వరించి రావాలని, కోరుకుంటే వచ్చేది కాదని తెలిపారు. బీజేపీనో, టీడీపీనో సీఎం పోస్టును అడగనని స్పష్టం చేశారు.

janasena chief pawan kalyan comments on alliance, says ready to go with left and right parties to defeat YCP kms
Author
First Published May 11, 2023, 5:46 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో, రాజకీయ శ్రేణుల్లో వినిపిస్తున్న వదంతులకు చెక్ పెట్టారు. ముఖ్యమంత్రి పదవి గురించీ స్పష్టత ఇచ్చారు. సీఎం పదవి వరించి రావాలని, మనం కోరుకుంటే రాదని అన్నారు. కండీషన్లు పెట్టి కూడా సీఎం పదవిని సాధించలేం అని పేర్కొన్నారు. 

గత ఎన్నికల్లో తమకు 30 సీట్లు వచ్చి ఉంటే ఇప్పుడు సీఎం రేసులో ఉండేవాడినని చెప్పారు. అంతే కానీ, ఇప్పుడు సీఎం పదవి గురించి కండీషన్లు పెట్టబోనని వివరించారు. బీజేపీనో, టీడీపీనో సీఎం పదవిని అడగబోనని స్పష్టంగా వెల్లడించారు. 

పొత్తులు మాత్రం కచ్చితంగా పెట్టుకుంటామని వివరించారు. కానీ, అందుకు తన సీఎం కండీషన్ ప్రామాణికంగా లేదని చెప్పారు. ఎవరి సిద్ధాంతాలూ వారికి ఉంటాయనీ పేర్కొన్నారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకుంటున్నామని చెప్పారు. 

తమకు కొన్ని స్థానాల్లో 30 శాతం ఓటింగ్ ఉన్నదని అన్నారు. అలాంటి స్థానాల్లో కచ్చితంగా తాము పోటీ చేస్తామని వివరించారు. మిగితా చోట్ల తాము పొత్తు పెట్టుకునే పార్టీలకు అవకాశం ఇస్తామనే సంకేతాలు ఇచ్చారు. తమ బలాన్ని బట్టే సీట్లు అడుగుతామని వివరించారు. తమ సత్తా చూపే సీఎం సీటును అడుగుతామని తెలిపారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటున్నట్టు తెలుస్తున్నదని పవన్ కళ్యాణ్ చెప్పారు. జూన్‌లో తాను క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తానని వివరించారు. జూన్ 3వ తేదీ నుంచి ఇక్కడే ఉండబోతున్నట్టు చెప్పారు.

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పునరుద్ఘాటించారు. అందుకు అవసరమైతే లెఫ్ట్, రైట్ పార్టీలతో కలిసే పోటీ చేయాలని అనుకుంటున్నట్టు వివరించారు. బలమైన ప్రధాన పార్టీలు కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద తమకు సరాసరి 7 శాతం ఓటు బ్యాంకు ఉన్నదని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios