అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తాను ఇచ్చిన 100 రోజుల సమయం సెప్టెంబర్ 7 నాటికి పూర్తవువుతందని ఆ తర్వాత ప్రశ్నించడం మెుదలుపెడతామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో వైసీపీ 100 రోజుల పాలనపై అధ్యయనం చేయబోతున్నట్లు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ 30 మంది సభ్యులతో 10 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

సెప్టెంబర్ మూడోవారం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమలలో పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఉత్తరాంద్రలోని అయిదు పార్లమెంట్ సెగ్మెంట్ల సమావేశాలు విశాఖపట్నంలోనూ, రాయలసీమలోని 8పార్లమెంట్ సెగ్మెంట్లకు రాయలసీమలోని ప్రధాన కార్యాలయంలో సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. 

సమావేశాల అనంతరం అక్టోబర్ నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరుకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పార్లమెంట్, అసెంబ్లీ, మండల,గ్రామస్థాయి కమిటీలను నియమించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. 

కార్యకర్తలను సిద్ధం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినందుకు కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురవ్వొద్దన్నారు. కాస్త ఓర్పుతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 

అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. 

అక్రమ కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు అండగా ఉండేందుకు పార్టీ లీగల్ సెల్ విభాగాన్ని పటిష్టం చేయాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాలో లీగల్ సెల్ కమిటీలను పటిష్టం చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. 

ఈ సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కేసుల విషయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై రాజకీయ వ్యవహారాల కమిటీ అభినందించింది. రాజోలు వస్తానని హెచ్చరించడంతో అందరిలో కదలిక వచ్చిందని చెప్పుకొచ్చారు. పవన్ ఇచ్చిన భరోసాతో కార్యకర్తల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యిందని రాజకీయ వ్యవహారాల కమిటీ స్పష్టం చేసింది. 

 ఈ వార్తలు కూడా చదవండి

తలపై తుపాకి పెట్టినా జనసేనను కలపను: పవన్ కళ్యాణ్

ఆ పార్టీ నాపై ఒత్తిడి తెస్తోంది, ఒకేసారి మీద పడకండి ... జనసేన అధినేత పవన్