అమరావతి: జనసేన పార్టీ ఏ జాతీయ పార్టీలోనూ విలీనమయ్యే పరిస్థితి లేదని స్పష్టం చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జాతికోసం ఆవిర్భవించిన జనసేన పార్టీని తల మీద తుపాకులు పెట్టినా కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

మంగళవారం విజయవాడ పార్లమెంట్ నాయకులు, జనసైనికులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అన్ని ప్రాంతీయ పార్టీల్లాంటి పార్టీ కాదు జనసేన అని స్పష్టం చేశారు. ప్రతీ భారత పౌరుడిని సమంగా చూడాలన్న లక్ష్యంతో, జాతీయ సమగ్రతను కాపాడాలన్న కాంక్షతో జనసేన పార్టీని స్థాపించినట్లు తెలిపారు. 

తెలుగుప్రజల ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ముఖ్యమంత్రి అవ్వాలన్న లక్ష్యాలతో ఆవిర్భవించిన వైసీపీల్లాంటిది కాదన్నారు. 

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు పవన్ క్లాస్ పీకారు. రాజకీయం అంటే ఏదిపడితే అది మాట్లాడటం కాదన్నారు. కొందరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాల్లో ఉండాలి అంటే మాటమీద నియంత్రణ ఉండాలి. 

నోటికి వచ్చింది మాట్లాడి సోషల్ మీడియా అనే అద్భుతమైన వ్యక్థని దుర్వినియోగం చేయవద్దని హితవు పలికారు. కొద్దిమందిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే అవేమీ తనను ఆపలేవన్నారు. సోషల్ మీడియాలో జనసైనికులు సంయమనంతో మాట్లాడాలని పవన్ సూచించారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఆ పార్టీ నాపై ఒత్తిడి తెస్తోంది, ఒకేసారి మీద పడకండి ... జనసేన అధినేత పవన్