సంక్రాంతి పండగలలో భాగంగా ఇవాళ ఉదయం అమరావతిలో నిర్వహించిన భోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కీడు, పీడను భోగి మంటల్లో కాల్చేశామని... వచ్చే సంక్రాంతికి ఇవి వుండవని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. రాబోయేది టిడిపి-జనసేన ప్రభుత్వమే... కాబట్టి ప్రజలు సుఖసంతోషాలతో వచ్చే సంక్రాంతి పండగను జరుపుకుంటారని అన్నారు. తెలుగు ప్రజలందరికీ రాజధాని అమరావతి నుండి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజధాని అమరావతిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. భోగి సందర్భంగా ఉదయమే ఇద్దరు నాయకులు రాజధాని పరిధిలోని మదడం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భోగిమంటలు వేయడంతో పాటు మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను వీక్షించారు. అలాగే గంగిరెద్దులు, గోవులు, కోడిపుంజులతో పూర్తిగా సంక్రాంతి శోభను సంతరించుకున్న ఆ ప్రాంతంలో కలియతిరిగారు చంద్రబాబు, పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా టిడిపి, జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన 'భోగి సంకల్పం' కార్యక్రమంలో పవన్ ప్రసంగించారు.

ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం33 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని పవన్ పేర్కొన్నారు. ఇలాంటి రైతులతో వైసిపి ప్రభత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ... పోలీసుల లాఠీలతో కొట్టి బాధ పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ రైతుల కష్టాలు, కన్నీళ్లు తనను కలచివేసాయి... అందువల్లే ఈసారి వైసిపిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వొద్దని నిశ్చయించుకున్నానని అన్నారు. అందుకోసమే టిడిపితో కలిసి ఎన్నికలకు వెళుతున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
Also Read సంక్రాంతి సాక్షిగా నేను, పవన్ ఇచ్చే హామీ ఇదే..: భోగి వేడుకల్లో చంద్రబాబు కామెంట్స్
అమరావతి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తామని ... రాజధాని అమరావతే కొనసాగుతుందని పవన్ స్పష్టం చేసారు. ఇక్కడినుండే పాలన సాగిస్తూ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని పరిస్థితి వుంది... టిడిపి-జనసేన అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అని సగర్వంగా చెప్పుకునేలా చేస్తామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు బంగారం లాంటి రాజధాని నిర్మించుకుందామని పవన్ హామీ ఇచ్చారు.

అమరావతి సమస్య ఇక్కడి ప్రజలది మాత్రమే కాదు... యావత్ రాష్ట్ర ప్రజలదని పవన్ పేర్కొన్నారు. ఇవాళ అమరావతి ప్రజలకు వచ్చినట్లే రేపు శ్రీకాకుళం, పులివెందుల ప్రజలకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చని అన్నారు. ఐదు కోట్ల ప్రజల సమస్య అమరావతి ... వైసిపి ప్రభుత్వం అంతంతోనే ఇది పరిష్కారం అవుతుందన్నారు. ఒకవేళ మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఇక భవిష్యత్ చీకటిమయమే అవుతుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు.
