Asianet News TeluguAsianet News Telugu

ఆ వైసీపీ ఎమ్మెల్యేని ఓడించాల్సిందే.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్, ఎందుకంటే..?

కాకినాడ సిటీ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు పవన్ కళ్యాణ్. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని 20 డివిజన్ల స్థానిక నాయకులతో మాట్లాడారు. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్.. ద్వారంపూడిని నేరుగా టార్గెట్ చేశారు. 

janasena chief pawa kalyan special focus on that seat , why ksp
Author
First Published Dec 31, 2023, 6:44 PM IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ నేతల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పరిస్ధితిని సమీక్షిస్తున్న ఆయన ప్రస్తుతం కాకినాడలో వున్నారు. జనసేన పార్టీ అత్యంత బలంగా వున్న జిల్లా ఇది. ఇతర జిల్లాల కంటే ఇక్కడ జేఎస్పీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. 

కాకినాడ సిటీ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు పవన్ కళ్యాణ్. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని 20 డివిజన్ల స్థానిక నాయకులతో మాట్లాడారు. వార్డు కమిటీలను ఇంకా నియమించకపోవడంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి, కాకినాడ నగర అధ్యక్షుడిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని భావిస్తున్న స్థానాల్లో కాకినాడ నియోజకవర్గం కూడా ఒకటి. అందుకే పవన్ అంతగా కాన్సన్‌ట్రేట్ చేసినట్లుగా పార్టీ కేడర్ చర్చించుకుంటోంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ నేతలకకు ఎలాంటి సంకేతాలు పంపడం లేదు. 

ప్రస్తుతం కాకినాడ సిటీ నుంచి వైసీపీ సీనియర్ నేత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్.. ద్వారంపూడిని నేరుగా టార్గెట్ చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను చంద్రశేఖర్ రెడ్డి శాసిస్తున్నారని , కాకినాడ పోర్టు కేంద్రంగా డెకాయిట్ ద్వారంపూడి వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 15 వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి అన్నా, సీఎం సన్నిహితుడిగా పేరొందిన ద్వారంపూడి అన్నా వైసీపీ సీనియర్ నాయకులకు భయమేనని.. కానీ తనకు అలాంటి భయాలు లేవన్నారు. డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డిని, నటోరియస్, ఫ్యాక్షన్ మైండ్ ఉన్న ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు.

కాకినాడ సిటీలో ద్వారంపూడిని ఈసారి గెలవనివ్వనని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. అయితే దీనికి ఆ మరుసటి రోజే ద్వారంపూడి మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుటుంబానికి అసభ్య పదజాలంతో దూషించారు. పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా ఓడిస్తానని ద్వారంపూడి అప్పట్లో ప్రకటించారు. దీంతో కాకినాడలోని కాపు సామాజిక వర్గం .. ద్వారంపూడిపై తీవ్ర ఆగ్రహంతో వుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డిని ఓడించాలని కాపు యువత పట్టుదలతో వున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు సర్వేల్లోనూ ద్వారంపూడి ఏమాత్రం మెరుగైన పనితీరు కనబరచలేదని, ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వుందని తెలుస్తోంది. పవన్‌ను వ్యక్తిగతంగా దూషించడంతో పాటు దళితుడైన డ్రైవర్‌ను హత్యచేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు అండగా నిలిచిన వ్యవహారం దళిత వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. మొత్తానికి ఈ నియోజకవర్గంలో జనసేన టీడీపీ అభ్యర్ధి గెలుపు ఖాయమని పవన్ కళ్యాణ్ అంచనాకు వచ్చారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పవన్ కల్యాణ్‌లలో ఎవరు ఎవరిని ఓడిస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios