జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటర్లను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన దారుణంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా... ఓటమిపై ఆయన గత వారం రోజులుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో.. ఇతర పార్టీల నేతలు డబ్బులు పంపిణీ చేయడం వల్లనే తాము ఓడిపోయామని వారు భావిస్తున్నారు.  ఈ క్రమంలో ఓటర్లను ఉద్దేశించిన పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

‘నేను కొంత మందిని అడిగాను ఓటుకు ఎంతిచ్చారు అని. రూ.2 వేలు అని చెప్పారు. రూ.2 వేలను ఐదేళ్లకు విభజిస్తే రోజుకు రూపాయి వస్తుంది. గుడి దగ్గర భిక్షాటన చేసుకునే వారికి కూడా అంతకంటే ఎక్కువే వస్తాయి’ అని ఓటర్లను ఉద్దేశించి పవన్ పేర్కొన్నారు.

గడిచిన ఎన్నికల్లో అద్భుతాలు జరుగుతాయని తాను ఆశించలేదని పవన్  అన్నారు. ఓటమి ఎదురైనప్పుడే ఎవరు నిలబడతారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తన చివరి శ్వాస వరకు జనసేన పార్టీని మోస్తానని, ఇక ముందు కూడా బలంగా నిలబడతానని, అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇక్కడి నుంచి అంతా వెళ్లిపోయినా తాను ఒక్కడినే నిలబడతానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేమో చూస్తానని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ తన ఆశయాలనే చూశారని, ఇకపై తన రాజకీయ ఎత్తుగడలు చూపిస్తానని చెప్పారు.