గుంటూరు: పేదలందరికీ ఇళ్లుపేరుతో అదిగో ఇల్లు, ఇదిగో చూడు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన శంఖుస్థాపనలే చేస్తూ పేదలను మోసగిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. మేనిఫెస్టోలో ప్రతిఏడాది 5లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న పాలకుల హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. 

''అధికారంలోకొచ్చిన తొలి ఏడాది ఇళ్లనిర్మాణం కోసం వార్షిక బడ్జెట్లో రూ.3,600కోట్లు కేటాయించిన జగన్ ప్రభుత్వం, అందులోపెట్టిన ఖర్చెంతో ప్రజలకు సమాధానం చెప్పాలి. కేవలం రూ.472కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. అవి కూడా ఉద్యోగుల జీతభత్యాలకు ఇచ్చారు. ఆ విధంగా తొలిఏడాదే ఇళ్లనిర్మాణం పేరుతో పేదలను వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసగించిందని స్పష్టంగా ప్రకటిస్తున్నా'' అన్నారు. 

''వైఎస్సార్ జగనన్న కాలనీలకు ఆర్భాటంగా ముఖ్యమంత్రి ప్రారంభించారు. సెంటు స్థలంలో నిర్మించే ఇళ్లు ఏరకంగా ఉంటాయో, ఎలాంటి సౌకర్యాలుంటాయో, వాటిలో నలుగురు కుటుంబ సభ్యులు ఎలా ఉండాలో ప్రభుత్వం చెప్పాలి. 365 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మిస్తామని చెబుతున్నారు. ఆ విస్తీర్ణంలో వరండాకే 86చదరపు అడుగులు పోతుందని, అది తీసేయగా మిగిలే 218 చదరపు అడుగుల్లో ఎలా నిర్మాణం చేస్తారు? ఒక కుటుంబం నివసించడానికి 218 చదరపు అడుగులు సరిపోతాయా? ఎవరిని మోసం చేయడానికి, ఇంకెంతకాలం ప్రజలను దగాచేయడానికి ఇలాంటి జగనన్న కాలనీల పేరుతో ప్రకటనలిస్తారు'' అని కాల్వ నిలదీశారు. 

read more  బాంచన్ దొరా అనేలా... వారిని కట్టుబానిసలు చేయాలన్నదే జగన్ కుట్ర: కొల్లు రవీంద్ర

''ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తామంటూ, 17వేల జగనన్న కాలనీలు నిర్మిస్తామంటున్నారు. రెండేళ్లలో ఎక్కడా చిన్న గోడకూడా కట్టలేదు. 16లక్షల ఇళ్ల నిర్మాణానికి పనుల ప్రారంభోత్సవం చేశారు. చంద్రబాబుని ఆడిపోసుకుంటూ, తెలుగుదేశాన్ని దూషిస్తూ,ఇదివరకే మూడుసార్లు ఇళ్ల పంపిణీని వాయిదా వేశారు. ఎట్టకేలకు గతేడాది డిసెంబర్ 25న ఇళ్లపట్టాల పంపిణీని ప్రారంభించారు. ఆరోజు అనుకూల పత్రికలో, ఇతరత్రా ఇచ్చిన ప్రకటనల్లో జగన్మోహన్ రెడ్డి 15లక్షల ఇళ్లను ప్రారంభించబోతున్నారని చెప్పారు. ఆనాడు ఒకసారి, ఇప్పుడు మరోసారి ప్రారంభోత్సవం చేశారు. రంగురంగుల ప్రకటనల్లో ఇళ్లు చూపిస్తే, అవి పేదలకు ఇచ్చినట్టా?'' అని అడిగారు. 

''ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం మూడు అవకాశాలు ఇచ్చింది. ప్రభుత్వమే నిర్మాణానికి అవసరమైన సామగ్రి సరఫరా చేస్తుందని, నిర్మాణానికయ్యే కూలీల ఖర్చుని ఇస్తామని చెప్పారు. ఆ అవకాశాన్ని అందరూ తిరస్కరించారు. రెండో అవకాశమేంటంటే టీడీపీ ప్రభుత్వం అనుసరించిన పద్ధతి. లబ్ధిదారులే ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటే, అందుకు అవసరమైన సొమ్ముని దశలవారీగా చెల్లించడం. ఇక మూడోది ప్రభుత్వమే ఇళ్లునిర్మించి, లబ్ధిదారులకు తాళాలిస్తామనిచెప్పడం. మూడో ఆప్షన్ ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రారంభించిన పథకంలో, మూడో ఆప్షన్ కిందఎన్ని ఇళ్లు నిర్మిస్తున్నారో ఆయనెందుకు చెప్పలేదు'' అని ప్రశ్నించారు.

''సామాన్యుడు సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఇంటి నిర్మాణానికయ్యే ఖర్చుని తగ్గించే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం వాస్తవమా కాదా? రూ.5లక్షలని చెప్పి చివరకు ఇప్పుడు ముష్టి రూ.30వేలకు పరిమితం చేశారు'' అని మాజీ మంత్రి కాల్వ మండిపడ్డారు.