హైదరాబాద్:  భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ నవంబర్ 3వ తేదీన విశాఖపట్టనంలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ర్యాలీని ఎక్కడి నుండి ఎక్కడి వరకు నిర్వహించాలనే విషయమై స్థానిక పార్టీ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా జనసేన ప్రకటించింది.

హైద్రాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయంలో  జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఆదివారం నాడు సమావేశమైంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, నేతలు కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, శ్రీమతి పాలవలస యశస్విని , డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, ఎ. భరత్ భూషన్, బి.నాయకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

శుక్రవారం నాడు జనసేన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.ఈ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను రాజకీయ వ్యవహారాల కమిటీకి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజలు ఏ రకమైన సమస్యలతో  ఇబ్బందిపడుతున్నారనే విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించింది.

పార్టీ శ్రేణులలో స్థైర్యాన్ని పెంపొందించి యువ నాయకత్వం బలోపేతానికి ఉద్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలని రాజకీయ వ్యవహారాల కమిటీ డిసైడ్ చేసింది. కార్తీక మాసంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించిన కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పథకాల అమలులో వైఫల్యాలు, విద్యుత్ సంక్షోభం, సాగుదారుల సమస్యలపై కూడ  చర్చించారు. 

కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) విధానం  రద్దుపై ఇచ్చిన హామీ అమలులో జాప్యం, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై ప్రత్యేకంగా చర్చించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఇసుక విధానం అమలులో ప్రభుత్వ వైఫల్యం, ఉపాధి కోల్పోయిన కార్మికుల స్థితిపై చర్చించారు. ఇసుక కొరత కారణంగా పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల మద్దతుగా  విశాఖ పట్టణంలో ర్యాలీ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. 

ఇక తెలంగాణ రాష్ట్రంలో 16 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో పాటు తెలంగాణ బంద్ కు కూడ జనసేన మద్దతును ప్రకటించింది.