విజయవాడ: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద జనసేన నాయకుడు పోతిన మహేష్ ధర్నా చేయడానికి ప్రయత్నించాడు. జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది.

జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలోని దుర్గగుడిలో రథం వెండి సింహాలు మాయం కావడంపై వారు ఆందోళనకు దిగారు. మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. 

దుర్గగుడి వెండ రథంలోని మూడు సింహాల మాయంపై ఈవో, చైర్మన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని పోతిన మహేష్ విమర్శించారు. రథంలోని మూడు సింహాల మాయంపై విచారణను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఆ కుట్రను తాము తిప్పికొడుతామని ఆయన చెెప్పారు. 

రథంలోని మూడు సింహాల మాయంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, ఈవో సురేష్ బాబు నుంచే విచారణ ప్రారంభించాలని ఆయన అన్ారు. ఈవో సురేష్ బాబు మూడు సింహాలను తీసుకుని వెళ్లి వెల్లంపల్లికి ఇచ్చారని ప్రచారం సాగుతోందని ఆయన గుర్తు చేశారు. వెండి సింహాలను పూజిస్తే మంచి జరుగుతుందని వెల్లంపల్లివాళ్ల ఇంట్లో తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆయన అన్నారు.