అమరావతి: అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేళ రాజధాని ప్రాంత మహిళలపట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.  రాజధాని అమరావతిలోనే ఉండాలని పోరాడుతున్న మహిళలు ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శనం చేసుకొనేందుకు వెళ్తున్న సందర్భంలో ప్రకాశం బ్యారేజీపై పోలీసులు అడ్డుకొని లాఠీలు ఝుళిపించి, అరెస్టులు చేసిన విధానం అవమానకర రీతిలో ఉన్నాయని ఆయన అన్నారు. 

తమపట్ల మగ పోలీసులు ఎంత అవమానకరంగా ప్రవర్తించింది మహిళలు కన్నీళ్లతో చెబుతున్నారని ఆయన అన్నారు. ఆ మాటలు చాలా బాధ కలిగించాయని అన్నారు. దైవ దర్శనం కోసం వెళ్తున్నవారిని అడ్డుకోవాలని ఏ నిబంధనలు చెబుతున్నాయని, అమరావతి మహిళలకు అమ్మవారిని దర్శించుకొనే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు. 

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, వారి కుటుంబాలు 15 నెలలుగా పోరాటం సాగిస్తున్నారని, రాజధాని విషయంలో స్త్రీలు అలుపెరుగకుండా ఉద్యమంలో కొనసాగుతున్నారని ఆయన అన్నారు. వారిపట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన పాలకులు ప్రతి సందర్భంలోను అవమానపరుస్తున్నారని విమర్శించారు. .

 శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలియచేస్తున్నవారిని అరెస్టులు చేశారని ఆయన అన్నారు. వారిని తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలపై గౌరవంగా మెలగాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ప్రకాశం బ్యారేజీపై మహిళలను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ ను ఆయన కోరారు.