చంద్రబాబుతో పొత్తు: అమిత్ షా, నడ్డాలకు పవన్ కల్యాణ్ వివరణ
వచ్చే ఎన్నికల్లో తాము టిడిపితో పొత్తు పెట్టుకుంటామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ అమిత్ షాకు, జెపి నడ్డాకు వివరణ ఇవ్వనున్నారు.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో పొత్తు పెట్టుకుంటానని తాను ప్రకటించడంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, బిజెపి జాతీయాధ్యక్షుడు జేపి నడ్డాకు వివరించనున్నారు. అలా ప్రకటించడానికి గల కారణాన్ని ఆయన వారికి చెప్పనున్నారు. తమ పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ)లో భాగస్వామి అని, ఎన్డీఎలో తాము కొనసాగుతామని, అందుకు తాను కట్టుబడి ఉన్నానని పవన్ కల్యాణ్ చెప్పారు.
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడిని పవన్ కల్యాణ్ ఇటీవల కలిశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకుంటుందని చంద్రబాబుతో భేటీ తర్వాన ఆయన చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
పవన్ కల్యాణ్ శనివారంనాడు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించడానికి తాను బిజెపికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రగతి చూడాలని తాను బిజెపి జాతీయ నాయకత్వాన్ని కోరుతానని ఆయన చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మంచి సీట్లు సాధించి శాసనసభలోకి ప్రవేశిస్తుందని పవన్ కల్యాణ్ చెపపారు. రాష్ట్ర పెద్ద యెత్తున అభివ్రుద్ధి చేస్తామని, శాంతిభద్రతలన పరిరక్షిస్తామని, విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులను కేటాయిస్తామని, ఉత్తరాంధ్ర వలసను అరికడుతామని, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.