విజయవాడ: శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తిరగులేని మెజారిటీతో విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో వివిధ నామినేటెడ్ పదవులకు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. ఈ పరంపరలో జలీల్ ఖాన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. 

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. వక్ఫ్ బోర్డ్ చైర్మెన్ పదవి అనేది పాముల పుట్ట అని జలీల్ వ్యాఖ్యానించారు. 
 
టీడీపీకి తన నియోజకవర్గంలో పోరు హోరాహోరీగా సాగిందని, ఓట్లు నువ్వా నేనా అన్నట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఇతరుల వల్ల కొంత నష్టం జరిగిందని, ఓడిపోయినా కూడా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు మొత్తం కుల రాజకీయాల మీద నడిచాయని జలీల్ వ్యాఖ్యానించారు.