విజయవాడ: జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద శనివారం అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అధికారుల ప్రయత్నాన్ని అక్కడే ఉన్న వైఎస్సార్ కాంగ్రెసు నేత యలమంచిలి రవి అడ్డుకున్నారు. విగ్రహ కమిటీకి చెప్పకుండా కాకాని విగ్రహం ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రొక్లైనర్ ను అడ్డుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు, 

దాంతో యలమంచిలి రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత భారీ బందోబస్తుతో కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారని యలమంచిలి రవి మీడియాతో అన్నారు. విగ్రహం తొలగింపుపై ఎవరికీ సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పారు. తనను బలవంతంగా అరెస్టు చేశారని చెప్పారు.

యలమంచిలి రవికి మద్దతుగా ఆయన మద్దతుదారులు మాచవరం పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. రివికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా ధర్నాలో పాల్గొన్నారు.