2019 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రస్తుతం పాదయాత్రలో బిజీగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజలకు మరింతగా దగ్గరవ్వడానికి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వస్తే వైసీపీ అమలు చేసే కార్యక్రమాలతో పాటు మరిన్ని వివరాలతో ‘‘ జగన్ అన్న ఫర్ సీఎం’’ అనే కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజా సంకల్పయాత్రలో ఈ వెబ్‌సైట్‌ను ఆయన చేతులు మీదుగా పార్టీ ఐటీ విభాగం ఆవిష్కరించింది. దీనిలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నవరత్న కార్యక్రమాలు, ఇతర పథకాల అమలు, మీడియా, గ్యాలరీ, ప్రజా సంకల్ప యాత్ర విశేషాలు, వైఎస్సార్ కుటుంబం, జగన్ ప్రసంగాలను పొందుపరిచారు.

వీటితో పాటు వైఎస్సార్ ఆసరా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, అందరికీ పక్కా ఇళ్లు, వైఎస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛన్లు, మద్య విధానం ఇలా వివిధ పథకాల వివరాలను ఉంచారు. ఈ వెబ్‌సైట్‌లో డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అభిమానులు, ప్రజల సంక్షేమం కోరేవారంతా కార్యక్రమాల అమలుకు విరాళం అందించవచ్చు.