చంద్రబాబు ఎంపిక చేసే అభ్యర్ధులను తట్టుకోవాలంటే ముందు కావాల్సిందే ఆర్ధిక బలమన్న సంగతి అందరికీ తెలిసిందే.
వచ్చే ఎన్నికలకు వైసీపీ అధ్యక్షుడు యూత్ బ్రిగేడ్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వివిధ జిల్లాల్లో సరైన నాయకత్వం లేని నియోజకవర్గాలను గుర్తించేపనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. దానికితోడు టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏల నియోజకవర్గాలు ఖాళీ అవ్వటంతో అక్కడ కూడా ఇన్చార్జిలను నియమిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు ఎక్కువ టిక్కెట్లు కేటాయించటం ద్వారా రాష్ట్రంలోని యువ ఓటర్లను ఆకర్షించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లుకనబడుతోంది.
పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా వీలున్నంతలో యువతకు పట్టం కట్టడం ద్వారా రాజకీయాలను ఉరకలెత్తించాలని జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో చేరిన కాసు మహేష్ రెడ్డి, అనంతపురం తాడిపత్రి ఇన్ఛార్జ్ గా నియమితులైన పెద్దారెడ్డి, ఈనెల 29న పార్టీలో చేరనున్న కోటగిరి శ్రీధర్ ఎంపికే ఉదాహారణ. వీరుగాక పలువురు యువనేతల జాబితాను జగన్ జిల్లాల వారీగా సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇపుడు పార్టీలో ఉన్న ఎంఎల్ఏల్లో కూడా పలువురు యువత ఉన్నారు.
ఈ ఎంపికలో కూడా రాజకీయ నేపధ్యం, ఆర్ధిక స్ధోమత తదితరాలను జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ఎంపిక చేసే అభ్యర్ధులను తట్టుకోవాలంటే ముందు కావాల్సిందే ఆర్ధిక బలమన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులోనూ వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారం నిలుపుకోవటమన్నది చంద్రబాబుకు ప్రతిష్ట. వైసీపీ అధికారంలోకి రావటమన్నది జగన్ కు జీవన్మరణ సమస్య. అందుకే అభ్యర్ధుల ఎంపికను జాగ్రత్తగా చేయాలని జగన్ అనుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రధానంగా పార్లమెంట్ కు అన్నీ విధాలుగా బాగా పటిష్టంగా ఉన్న వారినే అభ్యర్ధులుగా ఎంపిక చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా వారే కవర్ చేయాలన్నది జగన్ ఉద్దేశ్యంగా కనబడుతోంది.
ప్రభుత్వ పనితీరుపై ప్రస్తుతం ప్రజల్లో ఉన్న వ్యతరేకతను క్యాష్ చేసుకునే విధంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. అందుకనే వీలైనన్ని సార్లు జిల్లాల పర్యటనలు చేయటమే లక్ష్యంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. జిల్లాల పర్యటనల్లో ఉండగానే గట్టి అభ్యర్ధులకోసం అన్వేషణ కూడా జరుపుతున్నారు. అధికారపార్టీకి సంబంధించి పలువురు ఎంఎల్ఏలపై వస్తున్న అవినీతి ఆరోపణలు, మంత్రులపై పేరుకుపోతున్న అసంతృప్తి వచ్చే ఎన్నికల్లో తనకు అనుకూలంగా మారుతాయనే జగన్ అంచనా వేస్తున్నారు. కాబట్టే పోటీ చేయబోయే అభ్యర్ధుల జాబితాను పటిష్టంగా ఉండేట్లు చూసుకుంటే విజయానికి తిరుగుండదని జగన్ నమ్ముతున్నారు.
