తండ్రి ఆశయాల కోసం, మహానేత ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకే వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర చేపట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తున్న తరుణంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రతో ప్రజల సమస్యలను విని వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. దేశంలో ఎవ్వరికీ ఇవ్వని విజయాన్ని ఏపీ ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఇచ్చారని తెలిపారు. పాదయాత్రలో చూసిన కష్టాలను సీఎం జగన్‌ పథకాలుగా మలిచారని చెప్పారు. 

గత పాలకులు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా.. వైఎస్‌ జగన్‌ ఉక్కు సంకల్పంతో పాలన ప్రారంభించారన్నారు.  ఏడాదిన్నరగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే ఉన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు దాదాపు అమలు చేశారు. దేశ చరిత్రలో ఏడాదిలోనే 90 శాతం ఎన్నికల హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ ఒక్కరికే దక్కుతుంది. ఆయన అమలు చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రతిపక్షాల దుష్ట ఆలోచనలను ప్రజలకు వివరిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఒక చరిత్ర అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. 14 నెలలు ప్రజలతో మమేకం అయ్యారు. అక్రమ కేసులు పెట్టినా బెదరకుండా జనంలోనే ఉన్నారు. ప్రజల్లో ఆదరణ ఓర్వలేక ప్రాణాలు కూడా తీయ్యాలని కూడా ప్రయత్నించారు

జగన్ ఎప్పుడూ జనంలోనే ఉన్నారు. జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేశారు. ప్రజలు ఆశీర్వదించి 51 శాతం ఓట్లతో 151 సీట్లు కట్టబెట్టారు. ప్రజల అజెండానే తన అజెండాగా తీసుకున్నారు. 16 నెలల్లో రాష్ట్ర దిశను మార్చిన నేత సీఎం జగన్‌ అని అందుకే ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ అనే కార్యక్రమనికి శ్రీకారం చుట్టామని’’ ఆయన పేర్కొన్నారు. 

పది రోజుల పాటు  పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావాలని పిలుపు నిచ్చామని చెప్పారు. ఇది ప్రజల పండగగా జరపాలని పిలుపునిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. చంద్రబాబు అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించేందుకే పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు.14 నెలలు ఎన్నికష్టాలు వచ్చినా సంకల్పం వదలలేదని, ఏడాదిన్నరలోనే సీఎం జగన్ 90 శాతం హామీలు అమలు చేశారని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్  చేసిన సంక్షేమ పాలన ప్రజలకు వివరిస్తామని వేణుగోపాల కృష్ణ తెలిపారు.