ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వ్యవస్థల్లో పలు మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే డీజీపీ, పలువురు అధికారులను మార్చిన జగన్... తన పర్సనల్ అసిస్టెంట్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే తన పీఏగా కె.నాగేశ్వరరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా కమలాపురానికి చెందిన నాగేశ్వరరెడ్డి(కేఎన్‌ఆర్‌) వివిధ పత్రికల్లో పనిచేశారు. 2008 నుంచి జగన్‌ వెన్నంటే ఉన్నారు. ముఖ్యంగా ప్రజాసంకల్ప పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. వివిధవర్గాలకు చెందిన నేతలతో జగన్‌ సమావేశాలు నిర్వహించడంలో కీ రోల్‌ పోషించారు.

తాజాగా... జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే పులివెందులలోని సీఎం క్యాంప్‌ ఆఫీసుకు పీఏగా డి.రవిశేఖర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందులకు చెందిన డి.రవిశేఖర్‌ మొన్నటి వరకు వైఎస్‌ జగన్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల క్యాంపు కార్యాలయంలో పీఏగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.