అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ  సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తీర్మానాన్ని మంగళవారం నాడు ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మాణాన్ని జగన్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని విభజన చేయడంతో  ఏర్పడిన నష్టాన్ని ప్రత్యేక హోదాతోనే పూడ్చే అవకాశం ఉందని  జగన్ అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ వద్దు... ప్రత్యేక హోదానే కావాలని కోరుకొంటున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయమై అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నట్టుగా జగన్ వివరించారు.

ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తోందన్నారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి పరిశ్రమలు, ఉపాధి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే హైద్రాబాద్ తెలంగాణకు వెళ్లిపోయిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.విభజనతో ఏపీకి చాలా అన్యాయం జరిగిందన్నారు. విభజన నష్టాలను ప్రత్యేక హోదాతోనే పూడ్చే అవకాశం ఉందన్నారు.

ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు పెట్టుబడికి వస్తాయన్నారు. ఐటీ, జీఎస్టీ మినహయింపులు కూడ వస్తాయన్నారు.14వ ఆర్థిక సంఘం సిఫారసులు అంటూ ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెబుతున్నారని జగన్ చెప్పారు. కానీ, 14వ, ఆర్థిక సంఘం ఏనాడూ కూడ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని సిఫారసు చేయలేదని జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు 14వ,ఆర్థిక సంఘం లేఖను ఆయన సభ్యులకు అందుబాటులో ఉంచినట్టుగా ప్రకటించారు.

కానీ, గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్‌తో మాట్లాడకపోవడం వల్ల ప్రత్యేక హోదా దక్కకుండా పోయిందన్నారు. గత ఐదేళ్లలో రెవిన్యూ లోటు 66, 500 కోట్లకు పెరిగిందన్నారు. 

తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రం కాబట్టి రాష్ట్రానికి న్యాయం చేయాలని  సీఎం జగన్ కోరారు. చట్టసభల్లో ప్రత్యేక హోదా కోసం ఒప్పుకొని డ్రామాలు చేశారని జగన్ విమర్శలు గుప్పించారు.విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన  విషయాన్ని ఏపీ సీఎం గుర్తు చేశారు.

ప్రత్యేక ప్యాకేజీ వద్దు... ప్రత్యేక హోదానే ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో జగన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే తీర్మానాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో చదివి విన్పించినట్టుగా ఏపీ సీఎం ప్రకటించారు.