అమరావతి: రాష్ట్రాభివృద్ధిలో సమతుల్యతను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్నమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేసి, వాటికి కేబినెట్ హోదాతో చైర్ పర్సన్స్ నియమించాలని ఆయన యోచన చేస్తున్నారు. 

ఆయన ఆలోచన మేరకు... రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలకు ఓ బోర్డు, ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలకు మరో బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేస్తారు నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలకో నాలుగో బోర్డును ఏర్పాటు చేస్తారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1970 దశకంలో మూడు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటయ్యాయి. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఈ ప్రాంతీయ బోర్డులు ఏర్పాటయ్యాయి. 1983లో ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బోర్డులను రద్దు చేశారు. 

తెలంగాణ ఉద్యమం ఎగిసిపడిన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ బోర్డులను పునరుద్ధరించారు. ఈ సమయంలో నాలుగు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ విషయంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రాంతీయ బోర్డులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

అభివృద్ధి అంతా రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్రీకృతమైందనే భావన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వివక్షకు గురవుతున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ స్థితిలో ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.