టీడీపీ యువనేత దేవినేని అవినాశ్ ఆ పార్టీనీ వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.  కాగా.. తాను పార్టీ మారాలని అనుకోలేదని కానీ కొన్ని కారణాల వల్ల మారాల్సి వచ్చిందని అవినాశ్ మీడియాకి వివరించారు.కాగా... అవినాశ్ వైసీపీకి వెళ్లగానే అక్కడ అతనికి ఏ పదవి దక్కుతుందా అనే విషయంపైనే సర్వత్రా చర్చ మొదలైంది.

నిన్నటి వరకు తెలుగుదేశం జెండాను భుజాన మోసిన అవినాశ్‌ పార్టీ మారడంతో జిల్లాలో కొంత గందరగోళం నెలకొంది.కొంతమంది అనుచరులు అవినాశ్‌ వెంట అడుగులు వేసినా, మరికొంతమంది మాత్రం వేచిచూసే ధోరణిలో ఉన్నారు. వాళ్లంతా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అవినాశ్‌ పార్టీ మా ర్పు అంశం ముఖ్యంగా విజయవాడలో కాక రేపుతున్నది. 

read more  టీడీపీకి దేవినేని అవినాష్ రాజీనామా

టీడీపీలో తగిన ప్రాధాన్యం లేదని ఆవేదనను వెళ్లగక్కిన అభిమానులు, వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారన్న దానిపై చర్చించుకుంటున్నారు. విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో దేవినేని నెహ్రూకు అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అదే అభిమానాన్ని అవినాశ్‌ పైనా చూపిస్తున్నారు. 

విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అవినాశ్‌కు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, బొప్పన భవకుమార్‌లు నేతలుగా ఉన్నారు. వారిలో భవ కుమార్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అవినాశ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించాల్సి వస్తే మిగిలిన ఇద్దర్ని ఒప్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో జగన్‌ ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాలి.

ఇదిలా ఉండగా.. తాను పార్టీ మారడానికి గల కారణాలను అవినాశ్ మీడియాకు వివరించారు.  తన నాన్న(దేవినేని నెహ్రూ) మాటలను అనుసరించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దేవినేని అవినాశ్ తెలిపారు. శ్రేయోభిలాశులు, అనుచరులు మరీ ముఖ్యంగా కార్యకర్తల అభీష్టం మేరకే తాను టిడిపిని వీడి వైసిపిలోకి చేరినట్లు అవినాశ్ పేర్కొన్నారు.  read more  సీఎం జగన్ తో దేవినేని అవినాశ్ భేటీ... వైసిపీలో చేరిక

తాను ఎవరిని కించపరిచేలా కానీ అవహేళన చేసేలా మాట్లాడే వ్యక్తిని కానని... నమ్ముకున్న వాళ్ళ కోసం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడడం తన స్వభావమని అన్నారు.  ఒక వ్యక్తి  నాయకుడు అవ్వాలంటే అది ప్రజలు కార్యకర్తలు అండతోనే సాధ్యమన్నారు... అదే నాయకుడు ఒక అడుగు వేశాడంటే అండగా ఉన్న కార్యకర్తలు ప్రజల శ్రేయస్సు కోసమేనని అన్నారు. 

మీరు ఇచ్చిన బలం మీకే చెందుతుంది తప్ప ఎన్నడూ తన లాభాపేక్ష ఉండదని అవినాశ్ తెలిపారు. తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికోసం కమిట్మెంట్ తో  పనిచేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తానని  అన్నారు.

 ఒక అడుగు వేసేటప్పుడు ఎన్నో కారణాలు ఉంటాయని..అదే విధంగా ఒక మాట అనేటప్పుడు అన్నీ ఆలోచించి అనాలన్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న నాయకులను, కార్యకర్తలను వినియోగించుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలం అయ్యిందన్నారు. పార్టీలో చేరినప్పటి నుండి  అధినాయకుడి మాటే .. నా బాట అని నమ్మి నిబద్ధతతో పని చేసానని...అందుకు ప్రతిఫలంగా కార్యకర్తలకు, నాయకులకు సముచిత స్థానం కల్పించమని చంద్రబాబును కోరానని అన్నారు.

తనమీద నమ్మకంతో అప్పజెప్పిన ప్రతిబాధ్యతని నిజాయితీ, క్రమశిక్షణతో నిర్వహించానని...గత ఎన్నికల్లో అనువైన  స్థానం కాకపోయినా ఆయన ఆదేశాల  మేరకు గుడివాడ నుండి పోటీచేశానని తెలిపారు. ఓటమి బాధ కలిగించినా లెక్కచేయకుండా పార్టీ కోసమే ముందడుగేసానని... కానీ ఇన్నాళ్లుగా అనుక్షణం వెన్నంటి ఉన్న కార్యకర్తలకు, దేవినేని నెహ్రూ అనుచరులకు తగిన ప్రాధాన్యం దొరకకపోవడం బాధ కలిగించిందని ఆవేధన వ్యక్తం చేశారు. 

టిడిపిలోని కొంతమంది లోకల్ నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నా అధిష్టానం పట్టించుకోకపోవడం కార్యకర్తలకు రుచించలేదన్నారు. అలాగే తన నిబద్ధతను పార్టీ అధిష్ఠానం తేలికగా తీసుకుందని... కార్యకర్తల మనోభావాలను  పరిగణలోకి తీసుకోకుండా వారికి ప్రాధాన్యం కలిగించడ లో పూర్తిగా విఫలం అయిందన్నారు. 

ఈ రోజు తాను కానీ, నాన్న దేవినేని రాజశేఖర్ నెహ్రు గారు కానీయండి .. ఇలా ఉన్నాం అంటే అది కేవలం మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానుల వల్ల మాత్రమేనని... అలాంటి కార్యకర్తలకు ప్రాధాన్యం లేని చోట  ఉంటూ  ఆత్మవంచన చేసుకోవద్దని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే పార్టీలో కమిట్మెంట్ తో పని చేసే వారికి ప్రాధాన్యం లేకపోవడం, భజన చేసే వారికి అధిష్టానం వత్తాసు పలకడం మనసును ఎంతో గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

టిడిపిని వీడే ఉద్దేశం లేదని నేను ఎన్ని విధాలుగా చెప్పినా ఎప్పటికప్పుడు తన పార్టీ మారుతున్నానని వదంతులు పుట్టించి, అధిష్టాననానికి తన గురించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేశారని... వాటిని గుర్తించకుండా పార్టీ పెద్దలు ఇంకా వారినే చేరదీస్తూ ఉండడంతో మనసు విరిగిపోయిందన్నారు. అందువల్లే పార్టీని వీడాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.