Asianet News TeluguAsianet News Telugu

‘సాక్షి’కి ప్రజాధనాన్ని దోచిపెడుతున్న జగన్.. చందాలు, ప్రకటనల రూపంలో రూ.1200 కోట్లు...

చందాలు, అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ప్రజాధనాన్ని సాక్షికి దోచి పెడుతున్నారని వైఎస్ జగన్ మీద టీడీపీ అధికార ప్రతినిధి విరుచుకుపడ్డారు. 

Jagan looting public money for 'Sakshi', Rs. 1200 crores in the form of subscriptions and advertisements TDP accuses - bsb
Author
First Published Oct 9, 2023, 9:18 AM IST

నెల్లూరు : టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి సీఎం జగన్, సాక్షి పత్రికలపై విరుచుకుపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత.. ఆయన సొంత పత్రిక అయిన సాక్షి సర్కులేషన్ను ఐదు లక్షల కాపీలు పెంచుకున్నారన్నారు.  దీనికి అనుగుణంగానే సాక్షిలో ప్రకటన రేట్లు పెంచారని.. యాడ్స్ రేట్లు రెట్టింపు చేసి సాక్షిపత్రిక, ఛానల్ కు రూ.1,200 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. 

సాక్షి పత్రిక సర్కులేషన్ పెంచడానికి కోసం ఒక్కో సచివాలయానికి రెండు చొప్పున 60 వేల పత్రికలు వేస్తున్నారన్నారు. ఇక సచివాలయ ఉద్యోగులందరికీ 100% ఆ పత్రికే వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే.. 1.54  లక్షలు సర్కులేషన్. ఇక గ్రామవాలంటీర్లు 2,34,694 మంది సాక్షి పత్రికను తీసుకుంటున్నారు. ఇవే కాకుండా ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ లాంటి ప్రభుత్వ కార్యాలయాలకు లక్ష కాపీలు సాక్షి పత్రిక వెళుతోంది. ఈ లెక్కలన్నీ చూస్తే మొత్తంగా ఐదు లక్షల కాపీలకు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చందా కడుతోంది. ఇది నిజం’ అని ఆనం వెంకట రమణారెడ్డి ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే శంకరనారాయణకు తప్పిన పెను ప్రమాదం.. వాహనంపై డిటోనేటర్ విసిరిన వ్యక్తి...

ఆదివారం నాడు ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులోని టిడిపి ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సాక్షిలో గతంలో పనిచేసిన ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్మెంట్ హోమ్ లా తయారయింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్ రూ.1256 కోట్ల పెట్టుబడితో సాక్షి పత్రిక, ఛానల్ తీసుకొచ్చారు. సాక్షి పుట్టుకే అవినీతితో ప్రారంభం అయింది’ అంటూ  విరుచుకుపడ్డారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రికకు లక్షల కాపీలు చందా రూపంలో ప్రభుత్వ ఖజానా నుంచి దోచిపెడుతున్నారు. దాదాపు రూ.400 కోట్లనుంచి రూ. 450  కోట్ల వరకు చెల్లించారు. మొత్తంగా చూస్తే రూ. వెయ్యి కోట్లు ఇప్పటికే ఇచ్చేశారు. ఈ దోచిపెట్టడాన్ని మోసం అంటారా? దొంగతనం అంటారా?.. వాలంటైన్స్ గిఫ్ట్ అంటారా?.. అంటూ  ఎద్దేవా చేశారు. ఇలా జగన్ తన భార్య భారతి చైర్పర్సన్ గా ఉన్న సాక్షి పత్రికకు ప్రజలు కట్టే పనుల నుంచే చందాలను చెల్లిస్తున్నారని ఆరోపించారు.

సాక్షి ఉద్యోగులే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. సాక్షిలో పనిచేసి రిటైర్ అయిన వారే ముఖ్యమంత్రి సలహాదారులుగా, ప్రభుత్వ సలహాదారులుగా, పౌర సంబంధాల అధికారులుగా, అకాడమీ చైర్మన్గా ఉన్నారని  మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న చాలామంది సాక్షి మాజీ ఉద్యోగులే. ప్రజల సొమ్మునే వారికి జీతాలుగా చెల్లిస్తున్నారు. రూ.1200  కోట్లకు పైగా ప్రజల సొమ్మును ఓ పత్రికకు ఈ లెక్కన కట్టబెట్టారు. దీన్ని దోపిడీ అనక ఏమంటారు?’ అని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి ఎండి, చైర్మన్గా జగతి పబ్లికేషన్ను ఏర్పాటు చేసిన సాక్షిలో 1256 కోట్లను పెట్టుబడులుగా పెట్టారు. రూ. 10 విలువ కలిగిన షేర్ ను ప్రీమియం ధరపై రూ. 350 చొప్పున అన్నారు. ఇంకా పత్రిక కూడా బయటికి రాకముందే.. ఛానల్ ప్రసారాలు ప్రారంభం కాకముందే అంత ధరను ఎవరైనా పెడతారా.. అలా పెట్టి కొంటారా?  అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలైన ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని సిబిఐ చెబుతోంది. కానీ  తాడేపల్లి ప్యాలెస్ లో టీ పెట్టే వ్యక్తి దగ్గర నుంచి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  వరకు చంద్రబాబే ఆర్థిక ఉగ్రవాది అని ఢంకా బజాయిస్తున్నారు. 

చంద్రబాబు రూ. మూడువేల కోట్లు దోచేసారని ఒకసారి.. కాదు కాదు రూ. 300 కోట్లు అని మరోసారి నోటికి ఎంత వస్తే అంత అబద్ధపు లెక్కలు చెబుతున్నారు’అంటూ మండిపడ్డారు. ఇక మరోవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి పులివెందుల నుంచి కడప వరకు.. అనేక వేల ఎకరాల భూములు ఉన్నాయని అంటారు. 2003-2004 ఎన్నికల అఫిడవిట్లో అదే కనక నిజమైతే జగన్మోహన్ రెడ్డి తన పూర్తి ఆస్తిని రూ.2.12  కోట్లు అని మాత్రమే ఎందుకు చూపించారు? జగన్ సీఎం అయ్యేటప్పటికి  వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి2.12 కోట్లు మాత్రమే’ అన్నారు.

‘2003-04 సంవత్సరంలో  ఐటి రిటర్న్ దాఖలు సమయంలో జగన్ తన ఆదాయం రూ.9 లక్షలని తెలిపారు. అదే 2009 నాటికి వచ్చేసరికి  ఎన్నికల అఫిడవిట్లో జగన్ ఆస్తి వివరాలు రూ.77.47 కోట్లు ఉంది.  2010 సెప్టెంబర్ లో రూ. 90 కోట్లు తొలి త్రైమాసికానికి అడ్వాన్స్ టాక్స్ గా చెల్లించారు. దీన్నిబట్టే.. ఎంత ఆదాయం ఉంటే ముందస్తుపన్నుగా అంత పెద్ద మొత్తం చెల్లిస్తారు? ఇంత తక్కువ సమయంలో అంత ఆదాయం ఎలా వచ్చింది అని పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలే జగన్ ని చూసి ఆశ్చర్యపోయారు’ అని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాకెట్ కంటే వేగంగా.. ఆర్థికంగా ఎదిగారనేది వాస్తవం కాదా? అంటూ  వెంకటరమణారెడ్డి నిలదీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios