ఎమ్మెల్యే శంకరనారాయణకు తప్పిన పెను ప్రమాదం.. వాహనంపై డిటోనేటర్ విసిరిన వ్యక్తి...
ఆదివారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే శంకరనారాయణ గడ్డం తండా గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి ఆయన వాహనంపై డిటోనేటర్ విసిరాడు.

పెనుగొండ : ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి పెనుగొండ ఎమ్మెల్యే వాహనం మీద డిటోనేటర్ విసిరాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డిటోనేటర్ వేసిన సమయంలో ఎమ్మెల్యే బండిలో లేరు. దీంతోపాటు డిటోనేటర్ పేలలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
వైసిపి ప్రభుత్వం మొదలుపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం గడ్డంతండా పంచాయితీలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మరికొంతమంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. వాహనాల్లో కాకుండా ఊరేగింపుగా గడ్డంతండాకు వెళ్లాలని ఆలోచన చేశారు. దీనికోసం తాము వచ్చిన అన్ని వాహనాలను కాస్త దూరంలో ఉన్న కళ్లితండా దగ్గర ఆపి నాయకులంతా బండ నుంచి దిగారు.
వైసీపీ ఎమ్మెల్యే శంకరనారాయణకు చేదు అనుభవం.. వాహనంపై చెప్పులతో దాడి.. !!
ఎమ్మెల్యే వాహనాన్ని చూసిన ఓ వ్యక్తి బండలు పగలగొట్టడానికి ఉపయోగించి డిటోనేటర్ ను వాహనం మీదికి విసిరాడు. అయితే, అప్పటికే ఎమ్మెల్యే బండి దిగిపోవడం, ఆ డిటోనేటర్ పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డిటోనేటర్ పడడం గమనించిన ఆ చుట్టుపక్కల వారు భయాందోళనలతో పరుగులు పెట్టారు.
అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించారు. డిటోనేటర్ విసిరిన వ్యక్తిని సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన గణేష్ గా గుర్తించారు. పాలసముద్రం సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఓ కంపెనీలో గణేష్ రాళ్లు పేల్చే పనులు చేస్తూ, ట్రాక్టర్ డ్రైవర్ గా కూడా కొనసాగుతున్నట్లు తెలిసింది. అతను ఆదివారం ఉదయం మద్యం తాగి, విధులకు హాజరయ్యాడు. దీంతో అతడిని గుత్తేదారు వెనక్కి పంపించినట్లుగా తెలుస్తోంది.
జిల్లా ఎస్పీ మాధవరెడ్డికి డిటోనేతర్ విషయం తెలియగానే వెంటనే హుటాహుటిన గోరంట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. డీఎస్పీ హుసేంపీరా, గోరంట్ల సీఐ సుబ్బరాయుడులను ఈ ఘటనకు సంబంధించిన వివరాల మీద ఆరా తీశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ విచారణ పూర్తి అయిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దీనిమీద ఎమ్మెల్యే శంకరనారాయణ కూడా మాట్లాడారు. తన వాహనంపై డిటోనేటర్ వేయడంపై ఇంకెవరైనా కుట్ర ఉందా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉందన్నారు.