లీడ్ క్యాప్ భూముల కోసం... నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేసిన టిడిపి
నిరుపేదలకు ఇళ్ల స్థలాలను అందిస్తామంటూ జగన్ ప్రభుత్వం విలువైన భూములపై కన్నేసిందని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది.
ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లీడ్ క్యాప్ సంస్థకు చెందిన భూముల్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం యత్నించడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు అన్నారు. లీడ్ క్యాప్ భూములపై నిజనిర్ధారణ చేసేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎరిక్సన్ బాబు, పిల్లి మాణిక్యాల రావు, ఎం.ఎస్.రాజులతో త్రిసభ్య కమిటీ వేయడం జరిగిందని తెలిపారు.
''2002లో చంద్రబాబు నాయుడు మీడియం, మెగా లెథర్ పార్కులు ఏర్పాటు చేసి చర్మకారులందరికీ ఉపాధి కల్పించారు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి లిడ్ క్యాప్ ను మూసేస్తే.. చంద్రబాబు నాయుడు మళ్లీ తెరిపించారు. చెప్పులు కుట్టుకునే చర్మకారులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచారు'' అని తెలిపారు.
read more మూడు సార్లు భోజనం పెట్టినందుకే... కేసీఆర్ కు ఏపి ఆస్తులు: జగన్ పై దేవినేని ఉమ ఫైర్
''సెంట్రల్ లెథర్ పార్కుతో ప్రత్యేకంగా చర్చలు జరిపి చెప్పులు, షూ, బెల్టులు తయారు చేసేవారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అలాంటి వాటిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూసివేయించారు. ఇప్పుడు ఆయా సంస్థల భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఈ కమిటీ సమగ్ర వివరాలు సేకరించడం జరుగుతుంది'' అని దారపనేని వెల్లడించారు.
చంద్రబాబు హయాంలో లిడ్ క్యాప్ లెదర్ ఇండస్ట్రీకి 751.91 ఎకరాల భూమిని ఇచ్చారు. అయితే విలువైన ఈ భూములను ఇవాళ జగన్ ప్రభుత్వం అన్యాక్రాంతం చేయాలనే ప్రయత్నం చేస్తుందని టిడిపి ఆరోపిస్తోంది. నిరుపేదలకు ఇళ్ల పట్టాల పేరుతో భూ కుంభకోణాలకు జగన్ ప్రభుత్వం తెరలేపిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాజాగా నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు.