విజయవాడ: వివిధ విషయాలపైద హైకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. దళిత డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపిందని... దీనిపై దేశ, అంతర్జాతీయ మీడియా ప్రభుత్వ తీరును ఎండగట్టిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్ సుధాకర్ కు ఎక్కడా గాయాలు లేవని చెప్పడంతో.. ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించడం చూశామన్నారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఉమ డిమాండ్ చేశారు.

''మీ అసమర్థత వల్ల , వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్ల మూడు జిల్లాల పోలీసు యంత్రాంగం సీబీఐ ఎంక్వైరీలో పడ్డాయి. మీ బాబాయి హత్యకేసు పులివెందుల పోలీస్ స్టేషన్ సెంటర్ గా కడప జిల్లా పోలీసు యంత్రాంగం అంతా సీబీఐ ఎంక్వైరీలో పడింది. గుంటూరు జిల్లాలో నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేశారు. తాజాగా విశాఖ జిల్లా పోలీసులు కూడా సిబిఐ ఎంక్వయిరీని ఎదుర్కోవాల్సి వస్తోంది'' అని అన్నారు. 

''విశాఖలో నడిరోడ్డుపై డాక్టర్ సుధాకర్ ని రెక్కలు విరిచి, తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టిన వ్యవహారంలో కోర్టుకు ఇచ్చే సమాచారంలోనే ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదంటే ఎటు వెళ్తున్నారో అర్థమవుతోంది. డీజీపీ హైకోర్టుకు రెండు సార్లు వెళ్లివచ్చారు. రంగుల వ్యవహారాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. సుమారు 1300 కోట్లు ఇందుకు ఖర్చు పెట్టారు. వీటన్నింటిపై ప్రభుత్వ పెద్దలు 5 కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పాలి'' అని డిమాండ్ చేశారు. 

''ఏడాదిలో 64 అంశాల్లో జగన్ కు కోర్టు మొట్టికాయలు వేసింది. మీడియాపై దాడులు చేస్తున్నారు. మీడియాను ఇబ్బంది పెట్టారు. రవిశంకర్ కార్యాలయంపై దాడి చేశారు.
 పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇంజనీరింగ్ చీఫ్ అధికారాలను కిందిస్థాయి అధికారులకు కట్టబెడుతున్నారు. ప్రాజెక్టు భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఏం కొంపలు మునిగాయని నేను అడుగుతున్నా. మేం 70శాతం పనులు పూర్తిచేశాం. మే 20వ తేదీన మెమో ఇచ్చారు. టెంపరరీ ఎరేంజ్ మెంట్లు చేస్తున్నారు. కావాల్సిన ఏజెన్సీల కోసమే ఇవన్నీ చేస్తున్నారా?'' అని నిలదీశారు. 

read more  ఎల్జీ కంపెనీ డైరెక్టర్ల పాస్‌పోర్టులు సరెండర్: ఎల్జీ ప్రమాదంపై హైకోర్టులో విచారణ

''6 నెలలుగా ఏజెన్సీలను మార్చడానికి తీసుకున్నారు. శాండ్ పనులు కట్టబెట్టడానికి రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడుతున్నారు. 500 కోట్లు దోచిపెట్టడానికి అధికారాలను బదలాయించారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వచ్చింది. ఎందుకు ప్రభుత్వం మూసుకుని కూర్చొంది. మీ మంత్రి మాట్లాడిన భాష నెల తక్కువ, బుర్ర తక్కువ.. ఈ ప్రభుత్వానికి బుర్ర మోకాలులో ఉందా. పోతిరెడ్డిపాడుపై జగన్ నోరు ఎందుకు మూసుకుపోయింది'' అని అడిగారు. 

''టీడీపీ హయాంలో అనేక రకాలుగా పట్టిసీమ, పురుషోత్తమపట్నం, పోలవరం పనులను అడ్డుకున్నారు. ఇవాళ పోలవరం ఆగిపోయింది. ఇరిగేషన్ కు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. కమీషన్ల కక్కుర్తితో ఏడాది పాటు పనులు ఆపేశారు. టీడీపీ హయాంలో 63,373 కోట్లు ఇరిగేషన్ కు ఖర్చుపెట్టడం జరిగింది. నదుల అనుసంధానం చేశాం'' అని తెలిపారు. 

''కేసీఆర్ తో జగన్ మూడు సార్లు భోజనం చేసి ఏపీ ఆస్తులను అప్పజెప్పారు.  విద్యుత్ బకాయిలు 5వేల కోట్లు రావాలి. వీటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మా విధానం చెప్పమంటున్నారు. వైసీపీది దోచుకునే విధానం. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ తన సొంత వాళ్లకు పనులు ఇచ్చారు. మేం సమగ్ర జల విధానంతో అభివృద్ధి చేయడం జరిగింది'' అన్నారు. 

'' బడ్జెట్ లక్షా 70వేల కోట్లలో ఏయే కార్పోరేషన్లకు ఎంతెంత ఖర్చు పెట్టారో చెప్పాలి. ఉద్యోగులకు జీతాలు కూడా పూర్తిగా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. దీనిపై బుగ్గన సమాధానం చెప్పాలి. అనేక ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి. మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు. జగన్ కు ఓటువేసినందుకు 5 కోట్ల ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు'' అని మండిపడ్డారు. 

''రూ.187 కోట్లు కోటీశ్వరులైన పరిశ్రమల యజమానులకు విద్యుత్ బకాయిలు రద్దు చేశారు. సామాన్యులు కరెంట్ బిల్లులు రద్దు చేయాలని కన్నీళ్లు పెడుతుంటే.. జగన్ కు వినపడదు, కనపడదు. సాక్షికి కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ పై చర్యలు లేవు. కోర్టు తీర్పులు, పోలవరం విషయంలో నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి'' అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.