అమరావతి: గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో వుండగా కూల్చేసిన ఆలయాలను పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సర్కార్‌ సిద్ధమైంది. కూల్చివేత‌కు గురైన ఆ దేవాల‌యాల పున‌ర్మిర్మాణానికి ఈనెల 8న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.  విజయవాడలో కూల్చివేసిన దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు–కేతు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడు గుడిని నిర్మిస్తామని చెప్పారు. 

ఈనెల 8న ఉదయం 11.01 గంటలకు ఆలయాల నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అదే విధంగా రూ.70 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. 13 జిల్లాల్లో 40 దేవాలయాల పునర్నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు.

read more  బాబు వస్తుంటే.. సాయిరెడ్డిని ఎలా రానిచ్చారు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

మరోవైపు ఇప్పటికే విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసు శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి అధికారులు ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

మతాలు, కులాల మధ్య విద్వేషాలు పెంచేవారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని.. ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశాలతో అర్ధరాత్రి ఆలయాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారని తెలిపారు. 

ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తుంటే జీర్ణించుకోలేక దొంగదెబ్బ తీయడానికి ఇలా కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని.. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావాలనుకుంటున్నారని ఆక్షేపించారు. వీటన్నింటినీ జాగ్రత్తగా పర్యవేక్షించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఇక, రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు. 

ఇప్పటి వరకు 39 శాతం ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిందని లబ్ధిదారుడికి నేరుగా ఇంటి పట్టా అందిస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాల పెండింగ్‌ కేసులను కలెక్టర్లు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.