ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పదవులు పందేరానికి జగన్ సిద్ధమయినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 4 రాజ్యసభ సభ్యత్వాలు 2020 ఏప్రిల్ లో ఖాళి అవనున్నాయి. కేశవ రావు, మొహమ్మద్ అలీలు తెలంగాణకు చెందినవారయినప్పటికీ, వారు మాత్రం లాటరీ పద్ధతి ద్వారా చేసిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డారు. వీరిరువురుతోపాటు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, తోట సీత రామలక్ష్మిల సభ్యత్వం కూడా 2020 ఏప్రిల్ 9వ తేదీన ముగియనుంది. 

ఇప్పుడు ఖాళీ అవనున్న ఈ నాలుగు సీట్లు కూడా అసెంబ్లీలో ఉన్న బలాబలాల దృష్ట్యా వైసీపీకే దక్కనున్నాయి. పదవులు అంటేనే నేతలంతా వాలిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ నామినేట్ చేయబోతున్న తొలి జాబితా. కాబట్టి పోటీ బలంగానే ఉండబోతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

Also read: రఘురామకృష్ణం రాజు ధిక్కారం: ఆయనకు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం ఇదే...

అయితే వైసీపీకి ఇక్కడొక కలిసొచ్చే అంశం ఉంది. పార్టీ తరఫున ముఖ్యనేతలంతా వివిధ పదవుల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా , లోక్ సభ ఎంపీలుగా ఆల్రెడీ పదవుల్లో ఉన్నారు. దీంతో రాజ్యసభ సభ్యత్వాల విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంతలా ఒత్తిడికి లోనుకాకుండానే  నిర్ణయం తీసుకోగలరు. 

అయితే అందుతున్న సమాచారం మేరకు... ఈ రాజ్యసభ సభ్యుల విషయంలో ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని సమాచారం. వివిధ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వైవీ సుబ్బారెడ్డికి ఒక బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు సమాచారం.  

 

వైవీ సుబ్బారెడ్డి అప్పట్లో పార్టీ ఆదేశాలానుసారం ఎంపీ సీటు ను త్యాగం చేశారు. ఒంగోలు నుంచి ఎంపీగా ఉన్న ఆయన అప్పట్లో ప్రత్యేకహోదా కోసం రాజీనామా చేశారు. తదుపరి ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు.

ఈ ఎన్నికలప్పుడు కూడా ఇద్దరి మధ్య అంత సఖ్యత లేదు అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాతి పరిణామాల్లో ఆయన రావడం, వచ్చి జగన్ ను కలవడం, ఆయన టీటీడీ చైర్మన్ అయిపోవడం అన్ని టకటకా జరిగిపోయాయి. 

Also read: చంద్రబాబు చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... ముప్పేటదాడికి కేసులు సిద్ధం

అప్పుడు పార్టీ అవసరం కోసం త్యాగం చేసినందుకు ప్రతిఫలంగా ఇప్పుడు రాజ్యసభ బెర్త్ దక్కనుందని సమాచారం. కాకపోతే టీటీడీ చైర్మన్ గా కూడా కొనసాగుతూ ఉండడంతో ఒకింత ఆయన ఈ పదవికి రాజీనామా చేస్తారా లేదా ఎలాగూ టీటీడీ చైర్మన్ అనేది లాభదాయకమైన పదవి కిందకు రాదూ కాబట్టి జోడు పదవుల్లో కొనసాగుతారా అనేది వేచి చూడాలి. 

జగన్ కు సన్నిహితుడు అయిన వ్యాపార వేత్త ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి కి కూడా అవకాశం దక్కనుంది.  గతంలో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అయోధ్యరామిరెడ్డి. ఇప్పుడు ఆయనకు రివార్డుగా ఈ పదవిని కట్టబెట్టనున్నట్టు తెలుస్తుంది. 

ఇక నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణమ రాజుకు చెక్ పెట్టేందుకు ఇటీవల వైసీపీలోకి  తీసుకువచ్చిన గోకరాజు కుటుంబీకుల్లో ఒకరికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్టు సమాచారం. 

ఇక వీరితోపాటు మిగిలి ఉన్న ఆఖరు నాలుగవ స్థానానికి నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఇటీవలే  టీడీపీ నుండి వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావుకు ఖరారు అయినట్టుగా సమాచారం. రాజకీయ సమీకరణాలను అనుసరించి ఇటీవలే పార్టీలో చేరినప్పటికీ కూడా బీద మస్తాన్ రావును రాజ్యసభకు పంపనున్నట్టు తెలుస్తుంది. ఆయన పార్టీలో చేరేటప్పుడే దీనిపై నిర్ణయం జరిగినట్టు తెలుస్తుంది.