కేంద్రప్రభుత్వంతో మాట్లాడి పంటలకు గిట్టుబాటు ధరకోసం ప్రయత్నించరు, ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేయరు, రాష్ట్రంలోని రైతాంగం సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురారు, అమెరికాకు మాత్రం వెళతారు అంటూ చంద్రబాబునుద్దేశించి జగన్ ఎద్దేవా చేసారు.

జగన్మోహన్ రెడ్డి అదే చెబుతున్నారు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే కేంద్రంతో మాట్లాడాల్సిన చంద్రబాబునాయుడు చల్లగా ఉంటుందని అమెరికాలో కూర్చున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు మండిపడ్డారు. ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడిని జగన్ కలిసారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 19 రకాల పంటలకు సరైన గిట్టుబాటు ధరల్లేక రైతులు అవస్తులు పడుతున్నారంటూ చెప్పారు. ‘కేంద్రప్రభుత్వంతో మాట్లాడి పంటలకు గిట్టుబాటు ధరకోసం ప్రయత్నించరు, ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేయరు, రాష్ట్రంలోని రైతాంగం సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురారు, అమెరికాకు మాత్రం వెళతారు’ అంటూ చంద్రబాబునుద్దేశించి జగన్ ఎద్దేవా చేసారు.

ప్రధానితో భేటీలో రాష్ట్రంలోని అనేక సమస్యలను ప్రస్తావించినట్లు చెప్పారు. ఎంఎల్ఏల ఫిరాయింపులు, మంత్రిపదవులు కట్టబెట్టటం, ఆగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి బాధితులకు పంపిణీ చేయాలని కోరినట్లు తెలిపారు. ఆగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో బినామీల రూపంలో నారా లోకేష్ తో పాటు పలువురు టిడిపి పెద్దలు ఇన్వాల్ అయినట్లు చెప్పానన్నారు. సిబిఐ విచారణ చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందని కూడా చెప్పారట. మిరపరైతుకు మద్దతు ధరను మరింత పెంచి న్యాయం చేయాలన్నారు.

ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించినట్లు తెలిపారు. ఎన్నికలపుడు ఇచ్చిన హామీని కూడా మోడికి గుర్తు చేసానన్నారు. తాము చేసిన డిమాండ్ల విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు జగన్ వెల్లడించారు.

రాష్ట్రపతి పదవికి పోటీ అనేదే లేకుండా ఉండాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అసలు రాష్ట్రపతి పదవికి పోటీ పెట్టాలన్న ఆలోచన చేయటమే తప్పన్నారు. ఎన్డీఏ అభ్యర్ధికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రజలకు మంచి జరిగే ప్రతీ అంశంలోనూ కేంద్రానికి తమ పూర్తి మద్దతుంటుందని జగన్ చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపిలో అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాగ తాను అనైతిక రాజకీయాలు చేయనని, ఏం చేసినా చెప్పి నేరుగానే చేస్తానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.