ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తాము జప్తు చేసిన ఆస్తులను రిలీజ్ చేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైకోర్టును ఆశ్రయించింది.

ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీలును విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ కె లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆస్తుల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

Also Read:ఆస్తుల కేసు: కోర్టుకు శ్రీలక్ష్మి హాజరు, వైఎస్ జగన్ గైర్హాజరు

ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతీలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్‌కు చెందిన ఆస్తులను 2012లో ఈడీ అటాచ్ చేసింది.

దీనిని ఈడీ అప్పీలేట్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. ఆస్తులను విడుదల చేస్తూ ఈ ఏడాది జూలై 26న ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై ఈడీ హైకోర్టులో అప్పీలు చేసింది. దీనిపైనే హైకోర్టు స్టేటస్ కో కొనసాగించాలని తెలిపింది.

Also Read:జగన్ ఆస్తుల కేసులో మరో మలుపు...మాజీ ఐఏఎస్ శర్మపై ఇంకో కేసు

కాగా ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ ఈ నెల 8న కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.