హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కోర్టుకు రాలేదు. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మాత్రం కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం వైఎస్ జగన్ కోర్టుకు హాజరు కావాలని ఇటీవల సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. కేంద్ర మంత్రి పర్యటన ఉన్నందున తనకు కోర్టు హాజరు నుంచి ఈ రోజు మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ కోరారు. జగన్ అభ్యర్థనను సిబిఐ కోర్టు అంగీకరించింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.

ముఖ్యమంత్రిగా ఉన్నందున, బాధ్యతలు నిర్వహించడానికి వీలుగా తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ గతంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగన్ పిటిషన్ పై సిబిఐ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. జగన్ కు మినహాయింపు ఇవ్వవద్దని, మినహాయింపు ఇస్తే జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ కోర్టు వాదించింది. 

వాదోపవాదాలు ముగిసిన తర్వాత కోర్టు జగన్ పిటిషన్ పై తన నిర్ణయాన్ని ప్రకటించింది. జగన్ కు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే కోర్టుకు హాజరు కావాల్సిందేనని కోర్టు తీర్పు చెప్పింది.

రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ భేటీ జరిగింది. అంతకు ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమయ్యారు.