పవన్ను వైసీపీ వైపు తీసుకొచ్చే బాధ్యతను ప్రశాంత్ పైనే జగన్ మోపారట. అందుకనే ప్రశాంత్ జనసేన అధ్యక్షుడి అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. జగన్ తరపున పవన్ అపాయిట్మెంట్ కోసం ప్రశాంత్ ప్రయత్నిస్తున్నవిషయం చంద్రబాబుకు లీకైందట. దాంతో వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు తాను కూడా పవన్ను కలిసేందుకు నిర్ణయించారు. రెండు రోజుల క్రితం వీరిద్దరి మధ్య జరగాల్సిన భేటీ రద్దైంది.
సాధారణ ఎన్నికల వేడి పెరిగేకొద్దీ పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోసం పాకులాట పెరిగిపోతోంది. పవన్ను తమవాడ్నిగా చేసుకుంటే చాలు అధికారం అందుకున్నట్లే అన్న ఆలోచనలతో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీలు పాకులాడుతున్నట్లు సమాచారం. పోయిన ఎన్నికల్లో టిడిపి, భారతీయ జనతా పార్టీ, పవన్ కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నారు కదా? టిడిపి, భాజపాలు అధికారంలోకి వచ్చాయంటే పవన్ ప్రభావం కూడా ఉందన్నది వాస్తవం.
సరే, తర్వాత రాజకీయ పరిణామాల్లో భాజపాకు పవన్ దూరమైనా చంద్రబాబుతో మాత్రం మంచి సంబంధాలనే కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటిరిగా పోటీ చేస్తుందని ఆమధ్య ఓ ప్రకటన కూడా చేసారులేండి పవన్. అయితే, తర్వాత ఆ ప్రకటనకు తగ్గ కసరత్తు మాత్రం ఎవరికీ కనబడటం లేదు. అయితే, జనసేన తరపున కటెంట్ రైటర్స్, స్పీకర్స్, విశ్లేషకులు అంటూ ఎంపికలైతే జరుగుతున్నాయి లేండి. వారిని ఎప్పుడు, ఎందుకు ఉపయోగించుకుంటారో కూడా తెలీదు.
ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి తరపున ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ తన జట్టుతో అనేక అంశాలపై సర్వేలు జరిపారట. సర్వే అంటే ఒక్క వైసీపీ గురించే ఉండదుకదా? టిడిపి,భాజపాలతో పాటు జనసేన గురించి కూడా అనేక అంశాలపై సర్వే జరిపారట. వచ్చే ఎన్నికల్లో జగన్, పవన్ కలిస్తే బాగుంటుందని ఫీడ్ బ్యాక్ వచ్చిందట.
ఫీడ్ బ్యాక్ లో వచ్చిన విషయాన్ని ప్రశాంత్ వైసీపీ అధ్యక్షుడితో మాట్లాడారట. వైసీపీ-జనసేన కలిస్తే వచ్చే ఎన్నికల్లో కలిగే లాభాలపై జగన్ కు ప్రశాంత్ ఓ ప్రజంటేషన్ ఇచ్చారు. దాంతో పవన్ను వైసీపీ వైపు తీసుకొచ్చే బాధ్యతను ప్రశాంత్ పైనే జగన్ మోపారట. అందుకనే ప్రశాంత్ జనసేన అధ్యక్షుడి అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చూస్తుంటే వైసీపీలో ప్రశాంత్ కీలక పాత్రే పోషిస్తున్నట్లు కనబడుతోంది.
అయితే, జగన్ తరపున పవన్ అపాయిట్మెంట్ కోసం ప్రశాంత్ ప్రయత్నిస్తున్నవిషయం చంద్రబాబుకు లీకైందట. దాంతో వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు తాను కూడా పవన్ను కలిసేందుకు నిర్ణయించారు. రెండు రోజుల క్రితం వీరిద్దరి మధ్య జరగాల్సిన భేటీ రద్దైంది. ఏదేమైనా పవన్ను తమవాడనిపించుకునేందుకు ఒకవైపు జగన్ మరోవైపు చంద్రబాబు ప్రయత్నాలను తీవ్రం చేసారు. జరుగుతున్న పరిణామాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో పవన్ మళ్లీ కీలక పాత్ర పోషించేట్లే కనబడుతోంది. కాకపోతే ఎవరి పక్షం నుండి అన్నదే తేలాలి.
