ప్రజాకర్షక పథకాలకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీకారం చుట్టారు. జనాకర్షణను ఎన్నికల్లో ఓట్ల రూపంలో మలుచుకోవాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ పేరును కలవరించినంత మాత్రాన ఉపయోగం లేదన్న విషయం అర్ధమైపోయింది. అందుకనే తాజాగా ఓ జనాకర్షక హామీని గుప్పించారు.  అనంతరపురం జిల్లా ధర్మవరంలో జగన్ రెండు రోజుల పాటు పర్యటించారు లేండి.

ఆ సందర్భంగా మాట్లాడుతూ, తాము అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటిల్లోని పేదలకు నెలకు రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తానని చెప్పారు. అదికూడా పింఛన్ తీసుకునే వయస్సును 45 ఏళ్ళకే తగ్గిస్తానని ప్రకటించటం గమనార్హం. ప్రస్తుతం ఏ విధమైన పింఛన్ తీసుకోవాలన్నా కనీస వయస్సు 55 ఏళ్ళన్న సంగతి తెలిసిందే.

అదే విషయాన్ని జగన్ మాట్లాడుతూ, చాలామంది పేదలకు కాయకష్టం చేయటంతోనే 45-50 ఏళ్ళకే అనారోగ్యం పాలవుతున్నారంటూ సానుభూతి వ్యక్తం చేసారు. అందుకే తాము అధికారంలోకి రాగానే పింఛన్ వయస్సును తగ్గిస్తున్నట్లు చెప్పారు. చేనేతలకు లక్ష రూపాయల వరకూ వడ్డీలేని రుణాలను అందిస్తామని, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా చేనేతల కోసం 25 లక్షల ఇళ్ళు కట్టిస్తామని కూడా హామీ ఇవ్వటం గమనార్హం. తాజాగా ఇచ్చిన హామీలు ఆమధ్య విశాఖపట్నంలో ప్రకటించిన ‘నవరత్నాల’కు అదనం అన్నమాట.

జనాలు ఓట్లు వేయాలంటే అభివృద్ధి మంత్రమో లేక తన తండ్రి పేరు చెబితేనో మాత్రమే చాలదని జగన్ కు అనుభవంలోకి వచ్చినట్లుంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అనేక హామీలను గుప్పించారు.

కాపులను బిసిల్లోకి చేర్చటం, రైతు, డ్వాక్రా, చేనేతల రుణమాఫీలు, జాబు కావాలంటే బాబు రావాలి, ప్రతీ నిరుద్యోగికి నెలకు రూ. 2 వేల భృతి,  ప్రపంప ప్రసిద్ధి చెందిన రాజధాని నిర్మాణం..ఇలా అనేక ఆచరణ సాధ్యం కాని అనేక హామీలిచ్చారు. అప్పటి ప్రత్యేక పరిస్ధితుల్లో జనాలు కూడా చంద్రబాబునే నమ్మారు. అందుకనే ముందస్తు ఎన్నికల వాతావరణం నేపధ్యంలో జగన్ కూడా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజాకర్షక హామీలకు శ్రీకారం చుట్టారు.