పవన్ కల్యాణ్‌కు జడ శ్రావణ్ అల్టిమేటం.. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ అల్టిమేటం జారీ చేశారు. మహిళల మిస్సింగులపై గతంలో పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు.
జడ శ్రావణ్ కుమార్. ప్రముఖ న్యాయవాది. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను ఫాలో అయ్యేవారికి సుపరిచితమైన పేరు జడ శ్రావణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు వరకు వైసీపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడారు. రాజధాని అమరావతి, ఇతర అంశాలపై న్యాయపరంగానూ పోరాటం చేశారు. వృత్తిపరంగా న్యాయవాది కావడంతో న్యాయపరంగా ఆయనకు అపారమైన మేధస్సు ఉంది.
ఇప్పుడాయన ప్రస్తావన ఎందుకంటే.. వైసీపీ హయాంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై టీడీపీ అనుకూల మీడియాలో నిర్వహించే న్యూస్ డిబేట్‌లలో పాల్గొనేవారు. వైసీపీకి వ్యతిరేకంగా డిబేట్ చేసేవారు. అయతే, సరిగ్గా ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఆయన స్టాండ్ మార్చేశారు. కూటమికి వ్యతిరేకంగా గళం వినిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనకు నోటాకి వచ్చినన్ని ఓట్లు కూడా దక్కలేదు. అమరావతి ప్రాంత సమస్యలపై న్యాయపరంగా పోరాడిన ఆయనకు మంగళగిరిలో కేవలం 416 ఓట్లే వచ్చాయి. (నోటా కి పడిన ఓట్లు : 890).
ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా, జగన్ సొంత ఛానెల్ అయిన సాక్షిలో జడ శ్రావణ్ కుమార్ కనిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే డిబేట్లలో పాల్గొంటారు. తాజాగా పవన్ కల్యాణ్‌కు సవాల్ చేశారు.
ఎన్నికల ముందు వారాహీ యాత్రలో పవన్ కల్యాణ్ ఆరోపించినట్లు 32 వేల మంది మహిళల మిస్సింగ్‌లపై జడ శ్రావణ్ కుమార్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
‘‘గతంలో 32వేల మంది మహిళలను వాలంటీర్ల ద్వారా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ట్రాన్స్‌పోర్ట్ చేయబడ్డారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే.. మీ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి’’ అంటూ ఇటీవల శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో క్లిప్‌లను వైసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది.
అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూల్చివేత అంశాన్ని కూడా జడ శ్రావణ్ కుమార్ తప్పుపట్టారు. పార్టీ ఆఫీసులు కూల్చడానికా ప్రజలు అధికారం ఇచ్చారా..? టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి అనుమతి ఉందా...? అంటూ ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు.