Asianet News TeluguAsianet News Telugu

వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15న విశాఖలో భారీ ర్యాలీ.. భవిష్యత్తు కార్యచరణను ప్రకటించిన జేఏసీ..

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఉమ్మడి కార్యచరణ ప్రకటించింది. జేఏసీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వికేంద్రకరణకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టనున్నట్టుగా తెలిపింది. 

JAC Will conduct huge rally on 15th october in visakhapatnam for executive capital
Author
First Published Oct 8, 2022, 11:33 AM IST

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఉమ్మడి కార్యచరణ ప్రకటించింది. జేఏసీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టుగా తెలిపింది. వికేంద్రీకరణకు మద్దతుగా ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ అధ్యక్షతన విశాఖలోని హోటల్ మేఘాలయాలో శనివారం నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, పలువురు ఫ్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 15న విశాఖలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. వికేంద్రీకరణకు మద్దతుగా అంబేడ్కర్ సర్కిల్ నుంచి వేలాది మంది నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టుగా వెల్లడించింది. భారీ నిరసన ప్రదర్శనతో విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఆకాంక్షను బలంగా తెలియజేస్తామని పేర్కొంది. వికేంద్రీకరణపై ఉప్పెనలా ఉద్యమం చేపడతామని తెలిపింది. వికేంద్రీకరణకు మద్దతుగా త్వరలో మండల, నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపింది. ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్ర అడుగు పెట్టకముందే నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. ఇక, జేఏసీ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ఉంటుందని మంత్రులు, వైసీపీ నాయకులు ప్రకటించారు. 

విశాఖకు రాజధాని, అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా జేఏసీ ఏర్పడిందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. నాన్ పొలిటికల్ జేఏసీలో ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘాల భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు.  

మరోవైపు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది సాధ్యమని చెప్పారు. అమరావతికి అన్యాయం చేస్తామని ఎక్కడ చెప్పలేదని తెలిపారు. ధర్మాన ప్రసాదరావు మాదిరిగానే.. తాను కూడా సీఎం జగన్ అనుమతిస్తే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios