హిందీ సినిమా చూసి తెలుసుకున్నా: పవన్ కల్యాణ్

హిందీ సినిమా చూసి తెలుసుకున్నా: పవన్ కల్యాణ్

శ్రీకాకుళం: సమస్యలు పరిష్కరించాలంటే ముందుగా సమస్య ఉన్నచోటికే వెళ్లి బాధితులతో మాట్లాడాలని ఓ హిందీ సినిమా ద్వారా తెలుసుకున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2019లో అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తీరని అన్యాయం చేశాయని, ఇష్టానుసారం జీవోలు జారీచేస్తూ అభివృద్ధి ముసుగులో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కాలుష్యం వల్ల ఏకంగా మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని అన్నారు.  పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే సహించేది లేదని అన్నారు.

జనసేన పోరుయాత్రలో భాగంగా రెండోరోజు సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే ఆయన పర్యటించారు. ఇచ్ఛాపురంలో స్వేచ్ఛావతి అమ్మవారిని ముందుగా దర్శించుకుని ఆ తర్వాత జనసేన కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. 
ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక ఇంకా చేపట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల మాదిరిగా ప్రజలను మోసగించేందుకు తాను రాలేదని ఆయన అన్నారు. ప్రతి పంచాయతీలో ఒక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ పెడుతున్నట్లు తెలిపారు. 

ఆడపిల్లలను కాపాడుకోలేక కొంత మంది 16 ఏళ్లకే వివాహం చేసేస్తున్నారని ఆయన అన్నారు. డబ్బున్నవారి పిల్లలే అభివృద్ధి చెందాలనేది సరికాదని, సమష్టిగా అభివృద్ధి జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఆ తర్వాత మఖరాంపురం మండలంలోని బెంతు ఒరియాలను కలుసుకున్నారు. తమకు కుల ధ్రువీకరణ పత్రాలు లభించడం లేదని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సోంపేట మండలం పలాసపురంలో థర్మల్‌ అమరవీరుల స్థూపం వద్ద రైతులతో భేటీ అయ్యారు. 

గతంలో కాల్పుల్లో మరణించినవారికి ముందుగా నివాళులర్పించారు. వేల ఎకరాలు భూములు, పంటపొలాలను నాశనం చేసేలా రొయ్యల చెరువుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విమర్శించారు. నీరు కూడా కాలుష్యమైతే ప్రజలెలా బతకాలని ప్రశ్నించారు. 

తన అభిమానుల్లో ఎక్కువమంది చిన్నపిల్లలే ఉన్నారని, అత్యుత్సాహంతో సమస్యలు పరిష్కారం కావని వారు తెలుసుకోవాలని అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page