చెన్నై: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నేత కంపెనీలపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే టీడీపీలోని పలు కీలక నాయకులపై ఐటీ దాడులు నిర్వహించి వారిని ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు ఐటీ దాడులను ఆపేందుకు సీఎం చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా ఆగడం లేదు. అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి చెందిన కంపెనీలపై ఐటీ దాడులకు దిగింది. 

చెన్న మహానగరంలోని ఆయనకు సంబంధించిన మాగుంట బాలాజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. టీ నగర్‌లోని కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు తనఖీలు నిర్వహిస్తున్నారు. 

అలాగే సవేరా హోటల్‌లో తనిఖీలు నిర్వహించగా అక్కడ భారీగా నగదు, బంగారం లభ్యమైనట్లు తెలుస్తోంది. దాడుల్లో ఐటీ అధికారులు ఆధారాలు లేని రూ. 55 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

ఇకపోతే ఏపీలో తెలుగుదేశం పార్టీని అణిచివేసేందుకు బీజేపీ ఐటీని ఉపయోగించుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే ఆరోపిస్తున్నారు. ఐటీ దాడులతో తమను భయపెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

అయినా ఆగకపోవడంతో ఏపీలోకి సీబీఐ ప్రవేశానికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు చంద్రబాబు. అయినా ఐటీ వదల్లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కాకుండా చెన్నైలో దాడులు చేస్తోంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్ని విమర్శలు చేసినా, ఆఖరికి సీబీఐ ఎంట్రీకి అడ్డుపెట్టినా కేంద్రంలో మార్పులేదంటూ సన్నిహితుల వద్ద వాపోయారట.