విజయవాడ: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. వరుసకు మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఆ బంధాన్ని అలాగే కొనసాగించాలని మరిదిపై ఒత్తిడి తెచ్చింది. 

ఇటీవలే పెళ్లి చేసుకున్న మరిది అందుకు అంగీకరించకపోవడంతో అతడ్ని, అతడి భార్యను హత్య చేయాలని నిర్ణయించుకుంది. పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో ప్రియుడుతోపాటు మరో అమాయకురాలు దుర్మరణం చెందిన ఘటన కృష్ణాజిల్లా పెనమలూరులో చోటు చేసుకుంది. 

పెనమలూరు మండలం కానూరులోని సతన్ నగర్ కు చెందిన ఖలీల్ వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఖలీల్ కు వదిన అయిన ముంతాజ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇటీవలే ఖలీల్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నప్పటి నుంచి ముంతాజ్ ను దూరం పెట్టాడు. 

వివాహేతర సంబంధం కొనసాగించాలని ముంతాజ్ ఖలీల్ పై ఒత్తిడి పెంచింది. అయినప్పటకీ అంగీకరించకపోవడంతో ఖలీల్ పై కోపం పెంచుకున్న ముంతాజ్ ఖలీల్ , అతని భార్యను అంతమెుందించాలని ప్రయత్నించింది. 

బుధవారం పెట్రోల్‌ నింపిన ప్లాస్టిక్‌ డబ్బా, వెలిగించిన కాగడాను పట్టుకొని నేరుగా ఖలీల్‌ ఇంటికొచ్చింది. గదిలో ఉన్న ఖలీల్‌పై పెట్రోల్‌ పోసి కాగడాను విసిరి తలుపులు మూసి గడియపెట్టింది. దీంతో క్షణాల్లో మంటలు ఖలీల్‌ను చుట్టుముట్టాయి. అదే గదిలో ఉన్న ఖలీల్‌ సోదరి హాజిని(27) సైతం దుర్మరణం పాలైంది. 

మంటల్లో కాలిపోతూ రక్షించాలంటూ ఖలీల్, హాజిని చేసిన హాహాకారాలు విని తల్లి భార్య అక్కడకు చేరుకుని తలుపులు తీయగా అప్పటికే హాజిని మంటల్లో కాలిపోయింది. తీవ్రగాయాలతో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఖలీల్ ను బంధువులు, స్థానికులు విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖలీల్ మృతిచెందాడు. ఇకపోతే ఈ ఘటనలో అన్నెం పున్నెం ఎరుగని మానసిక వికలాంగురాలు హాజిని దుర్మరణం పాలైంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితురాలు ముంతాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.