కాకాణి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ?

Is ycp mla kakani involved in forgery documents case
Highlights

  • నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్దనరెడ్డి పూర్తిగా ఇరుక్కున్నట్లేనా? పరిస్ధితులు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది.
  • ఆరోపణలను కొట్టేసిన మంత్రి కాకాణిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు.
  • దానిపై విచారణ జరిపిన పోలీసులు కాకాణి ఆరోపణలన్నీ కల్పితాలే అంటూ తాజాగా తేల్చారు.

నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్దనరెడ్డి పూర్తిగా ఇరుక్కున్నట్లేనా? పరిస్ధితులు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. మంత్రి సోమిరెడ్డి, కాకాణి మధ్య మొదలైన వివాదం బాగా ముదిరిపోయింది. ఆమధ్య కాకాణి మాట్లాడుతూ, మంత్రి సోమిరెడ్డి అనేక ఆరోపణలు చేసారు. సోమిరెడ్డి మలేషియా వెళ్ళారని, ధాయ్ ల్యాండ్ లో మంత్రి కుటుంబీకులకు ఆస్తులన్నాయంటూ కొన్ని డాక్యెమెంట్లను చూపించారు. మంత్రి తరచూ విదేశాలకు ఫోన్లు చేస్తుంటారని చెబుతూ సోమిరెడ్డి కాల్ లిస్టు కూడా విడుదల చేసారు. అప్పట్లో కాకాణి చేసిన ఆరోపణలు ఓ సంచలనం.

అయితే, ఆరోపణలను కొట్టేసిన మంత్రి కాకాణిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దానిపై విచారణ జరిపిన పోలీసులు కాకాణి ఆరోపణలన్నీ కల్పితాలే అంటూ తాజాగా తేల్చారు. అప్పట్లోనే మంత్రి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు పలువురుని అదుపులోకి కూడా తీసుకున్నారు. కాకాణి మంత్రికి వ్యతిరేకంగా విడుదల చేసిన డాక్యుమెంట్లన్నింటినీ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అందులోని సంతకాలన్నీ ఫోర్జరీవేనంటూ ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారట.

కాకాణి చెప్పిన తేదీల్లో సోమిరెడ్డి అసలు మలేషియాకే వెళ్ళలేదంటూ ఇమిగ్రేషన్ అధికారులు కూడా ధృవీకరించారు. దాంతో పోలీసులు పలువురిపై కోర్టులో చార్జిషీటు కూడా వేసారు. అందులో సహజంగానే కాకాణే ఏ 1 గా ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఫోర్జరీ సంతకాలు చేసేవారు, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసేవారు తదితరులున్నారు. కాకాణితో ఒప్పందం తర్వాతే తాను పోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేసినట్లు అదుపులో ఉన్నవారు అంగీకరించారట.

పోర్జరీ నిపుణులతో కాకాణి మాట్లాడిన ఫోన్ కాల్ లిస్టును కూడా పోలీసులు సంపాదించి కోర్టుకు అందచేసారు. అంటే కాకాణి చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకున్నట్లే కనబడుతోంది.  జిల్లాలో వైసీపీ వాణిని గట్టిగా వినిపించే ఇద్దరు, ముగ్గురిలో కాకాణి కూడా ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. సోమిరెడ్డికి కాకాణికి చిరకాల వైరముంది. పోలీసులు చెబుతున్నట్లుగా నిజంగానే కాకాణి గనుక పోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేయించి ఉంటే వైసీపీకి పెద్ద దెబ్బగానే భావించాలి అదీ ఎన్నికల ముందు.

loader