చంద్రబాబు పై ఆళ్ళ పరువునష్టం దావా ?

First Published 14, Nov 2017, 2:32 PM IST
Is ycp mla Alla filing a case on Naidu and his team over paradise papers issue
Highlights
  • చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడుతో పాటు ఓ వర్గానికి చెందిన మీడియాపై వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి త్వరలో పరువు నష్టం వేయనున్నరా ?

చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడుతో పాటు ఓ వర్గానికి చెందిన మీడియాపై వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి త్వరలో పరువు నష్టం వేయనున్నరా ? విశ్వసనీయవర్గాల సామాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఆళ్ళ పరువునష్టం దావా ఎందుకు వేస్తున్నట్లు ? అంటే, ప్యారడైజ్ పేపర్లను ఉదహరిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర ప్రపంచమంతా పాకిందంటూ చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడితో పాటు పలువురు టిడిపి నేతలు పదే పదే ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

టిడిపికి మద్దతిచ్చే ఓ పచ్చ పత్రికలో ప్యారడైజ్ పేపర్లలో దేశంలోని కొందరు పేర్లు వచ్చాయి. వారందరికీ విదేశాల్లో ఆస్తులు, అక్రమ సంపద ఉన్నట్లు సదరు పత్రికలో కథనం అచ్చయింది. దాన్ని పట్టుకుని చంద్రబాబు మొదలు ప్రతీ ఒక్కరూ జగన్ అవినీతి చరిత్ర ఇది..అంటూ ప్యారడైజ్ పేపర్లలో వచ్చిన వార్తలే ఆధారమంటూ మీడియా సమావేశాల్లో చెప్పేస్తున్నారు. టిడిపి నేతల ఆరోపణలను వైసీపీ అధినేత జగన్ ఖండించినా వారు మాత్రం తమ ఆరోపణలను మానటం లేదు. ప్యారడైజ్ పేపర్లలో వచ్చిన అబద్దపు వార్తలను పట్టుకుని తనపై చంద్రబాబు, టిడిపి నేతలు బురదచల్లుతున్నట్లు జగన్ పాదయాత్రలో ఎన్నోసార్లు చెప్పారు.

చివరకు ప్యారడైజ్ పేపర్లలో వచ్చిన వార్తలను రుజువు చేయాల్సిందిగా కూడా వైసీపీ అధ్యక్షుడు, చంద్రబాబునాయుడును సవాలు చేస్తూ 15 రోజులు గడువు ఇచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. జగన్ సవాలుకు టిడిపి నేతలు స్పందించకపోగా ఆరోపణలను మరింత ఎక్కువ చేసారు. దాంతో తమ అధినేత పరువును ఉద్దేశ్యపూర్వకంగానే బజారుకు ఈడిస్తున్న చంద్రబాబు, యనమల తదితరులతో పాటు అసత్య వార్తను ప్రచురించిన మీడియాపై కూడా పరువునష్టందావా వేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందుకు అవసరమైన సమాచారం మొత్తం సేకరించారట ఇప్పటికే.

ఇదిలా వుండగా, ప్యారడైజ్ పేపర్లకు సంబంధించి కొన్ని పేర్లను బయటపెట్టిన ఐసిఐజె వెబ్ సైట్లో కూడా విదేశాల్లో జగన్ కు అక్రమాస్తులున్నట్లు ఎక్కడా లేదు. అంతేకాకుండా విదేశాల్లో ఆస్తులు, ట్రస్టులు, వ్యాపారాలున్నాయంటూ ఐసి ఐజె పేపర్లలో పేరున్నంత మాత్రానా అదంతా అక్రమసంపాదనే అని కాదని  స్వయంగా ఐసి ఐజెనే స్పష్టం చేస్తోంది. విదేశాల్లో జగన్ కు అక్రమాస్తులున్నాయని రుజువు చేయాల్సింది కేంద్ర సంస్ధలే. రుజువయ్యేంత వరకూ ఎవరు అవినీతిపరులు కాదు వారివి అక్రమాస్తులూ కావు. కానీ టిడిపి మాత్రం జగన్ పై బురద చల్లేస్తోంది. ఆ విషయంలోనే ఆళ్ళ త్వరలో కోర్టుకు వెళ్ళనున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబుపై ఆళ్ళ అనేక అంశాల్లో కోర్టుకు వెళ్ళి ముప్పుతిప్పలు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

loader