సంచలనం: వైసిపితో టచ్ లో ఫిరాయింపు ఎంఎల్ఏలు

సంచలనం: వైసిపితో టచ్ లో ఫిరాయింపు ఎంఎల్ఏలు

రాజ్యసభ ఎన్నికలు రంజుగా జరుగనున్నాయి. బహుశా సస్సెన్స్ థ్రిల్లర్ ను మించిపోయినా పోవచ్చు. ఎందుకంటే, రాజ్యసభ ఎన్నికల్లో ఎలాగైనా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు. సరే, చంద్రబాబు ఎత్తుకు పై ఎత్తులు వేయాలని జగన్ ఎలాగూ ఆలోచిస్తారు కదా? ఈ ఎత్తులు, పై ఎత్తులతోనే రాజ్యసభ ఎన్నికలు రంజుగా జరగటం ఖాయంగా తెలుస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, రాష్ట్రంలో భర్తీ అవనున్న 3 స్ధానాల్లో టిడిపికి 2, వైసిపికి ఒక స్ధానం దక్కుతుంది. ఎంఎల్ఏల సంఖ్య, రాజ్యసభ స్ధానాల భర్తీ ప్రకారం ఒక్కో స్ధానానికి 44 మంది ఎంఎల్ఏలు ఓట్లు వేయాలి. ఈ లెక్కన టిడిపికున్న 104 మంది ఎంఎల్ఏలతో రెండు స్ధానాలు ఖాయం. ఫిరాయింపు ఎంఎల్ఏలు పోను వైసిపికి ప్రస్తుతం 44 మంది ఎంఎల్ఏల బలముంది. అంటే ఒక్క ఎంఎల్ఏ జారిపోయినా వైసిపికి రాజ్యసభ స్ధానం దక్కదు.

వైసిపి నుండి ఎలాగైనా ఇద్దరు ఎంఎల్ఏలను లాక్కోవాలని టిడిపి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి నేపధ్యంలోనే టిడిపిలో ఓ వార్త కలకలం రేపుతోంది. అదేంటంటే, వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏల్లో కొందరు తాజాగా వైసిపి నేతలతో టచ్ లో ఉన్నారట. ఈ విషయం బయటకు పొక్కటంతో టిడిపి నేతలు ఖంగుతిన్నారు.

వైసిపిలో టచ్ లోకి వెళ్ళిన ఫిరాయింపులు ఎవరు అన్న విషయమై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ మధ్యనే కర్నూలు జిల్లా కోడూరు ఎంఎల్ఏ మణిగాంధి చేసిన ప్రకటన కూడా అందుకూ ఊతమిస్తోంది. ‘కడప జిల్లా బద్వేలు ఎంఎల్ఏ జయరాములుతో పాటు తాను కూడా టిడిపిలోకి ఎందుకు వచ్చామా అని బాధపడుతున్నట్లు’ చెప్పటం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.

తామిద్దరమే కాకుండా ఇంకా చాలామంది ఎంఎల్ఏలు టిడిపిలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్వయంగా మణిగాంధి చెప్పటం అప్పట్లో సంచలనం రేపింది. అవే వ్యాఖ్యలను టిడిపి నేతలు ఇపుడు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అంటే వైసిపిలో నుండి ఎంఎల్ఏలను లాక్కోవాలని టిడిపి చూస్తోంది. అదే సమయంలో టిడిపిలోకి వెళ్ళిన ఫిరాయింపులతోనే చంద్రబాబును దెబ్బ కొట్టాలని వైసిపి ప్లాన్ చేస్తోంది. మొత్తానికి ఎవరి ప్లాన్ వర్కవుట్ అవుతుందో చూడాల్సిందే.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos