నారా లోకేష్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ పై టిడిపి పరువునష్టం దావా వేస్తుందా? ఇపుడీ అంశమే అమరావతిలోను, టిడిపిలోను చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఉదయం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం దావా వేసే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు.

ఏపీ ప్రజలు తెలివైన వారని ఎవరేంటో వాళ్లకు తెలుసని మంత్రి చెప్పారు. కాబట్టి పవన్ సర్టిఫికెట్ తమకు అవసరం లేదన్నారు. దిగజారుడు రాజకీయాలు విచారకరమని, తనతో ఫొటోలో ఉంది ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పెద్ది రామారావుగా లోకేష్ తెలిపారు.

పెద్ది రామారావును పట్టుకుని శేఖర్‌రెడ్డి అని ప్రచారం చేస్తున్నట్లు మంత్రి మండిపడ్డారు. ప్రతి ఏటా ఆస్తులు ప్రకటిస్తున్నట్లు చెప్పిన లోకేష్ ప్రకటించిన దానికన్నా చిల్లిగవ్వ ఎక్కువ ఉన్నా తీసుకోమంటూ సవాలు చేశారు. తనపై అప్పుడు జగన్ ఇప్పుడు పవన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు.

 అయితే, జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి లోకేష్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదంటూ పలువురు టీడీపీ నేతలు పవన్ పై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా అసత్య ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం దావా వేయాలని కొందరు నేతలు సూచించారని సమాచారం. ఈ నేపధ్యంలోనే పరువునష్టం దావా అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.